కలం, వెబ్ డెస్క్: కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఫస్ట్ క్లాస్‌లో పాసై, 500కు పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నాడు ఓ యువ ఇంజినీర్. అయినా ఒక్క ఆఫర్ లెటర్ కూడా అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఇతడి కథ సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగం రాకపోవడంతో జీవనోపాధి కోసం పొదుపు మొత్తమంతా ఖర్చయిపోవడంతో ర్యాపిడో రైడర్‌గా (Rapido Rider) మారాడు. ఉదయం 6 గంటల నుంచే బైక్ రైడర్‌గా పనిచేస్తున్నాడు. తాను ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్నానని ఇంట్లో నమ్మించిన ఈ యువకుడు తన పరిస్థితిపై ఎలాంటి నిరాశ చెందలేదు.
‘ప్రస్తుతం మార్కెట్ ఇలాగే ఉంది’ అంటూ పరిస్థితులను అంగీకరించడం గమనార్హం. నిరాజ్ అనే ఎక్స్ (ట్విట్టర్) వినియోగదారుడు ఆ రైడర్ హెల్మెట్‌పై ఉన్న కాలేజ్ స్టిక్కర్‌ను గమనించి మాట్లాడారు. దీంతో ఇతని కథ వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట విపరీతంగా వైరల్ (Viral) అవుతోంది.
ప్రస్తుత రోజుల్లో ఉద్యోగాల కోసం పోటీ నెలకొందని, వందకుపైగా దరఖాస్తులు చేసుకున్నా కనీసం ఇంటర్వ్యూ కాల్స్ కూడా రావడం లేదని అనేకమంది గ్రాడ్యుయేట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువుకున్న చదువుకు, మార్కెట్లో దొరుకుతున్న ఉపాధికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసానికి ఈ యువకుడి కథ చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. ఎంతోమంది ప్రతిభావంతులైన యువకులు తమ కలల ఉద్యోగం కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి తాత్కాలిక పనులను చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.

