కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని వాతావరణ, వ్యవసాయ (Telangana agriculture) పరిస్థితులపై ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వర్షాలు లేకపోవడం, సాగు ముందుకు సాగకపోవడంతో.. అది వ్యవసాయ ఆధారిత ఆదాయంపై ప్రభావం చూపనుంది. రైతుల ఆదాయం తగ్గితే గ్రామీల్లో కొనుగోలు శక్తి పడిపోతుందని, అప్పుడు అన్ని రంగాలపైనా ఎఫెక్ట్ పడుతుందని నిపుణుల అంచనా. అదే జరిగితే రాష్ట్ర ఖజానాపై ప్రభావం పడుతుందని సర్కార్ టెన్షన్ పడుతున్నది. రాష్ట్ర జీఎస్‌డీపీలో వ్యవసాయ రంగం వాటా ప్రత్యక్షంగానే దాదాపు 18% ఉంటున్నందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ ఆదాయం ఎంతమేర తగ్గుతుందోనని ఆందోళన చెందుతున్నది.
బడ్జెట్ తారుమారు!
ఆదాయం, ఖర్చులను బేరీజు వేసుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రూపొందించింది. ఇందులో పన్నుల రూపంలో సొంతంగా రూ.1.48 లక్షల కోట్లు వస్తాయని, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా మరో రూ.33,181 కోట్లు వస్తాయని ప్రణాళిక వేసుకున్నది. కానీ ఎల్‌నినో ప్రభావంతో సాగు విస్తీర్ణం తగ్గినా, పంటల దిగుబడి తగ్గినా అది రైతులకు ఇబ్బందికరంగా మారుతుంది. వారి చేతుల్లో ఆదాయం తగ్గి కొనుగోలు శక్తి (పర్చేజింగ్ పవర్) కూడా తగ్గుతుంది.
ఈ ప్రభావం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే కమర్షియల్ ట్యాక్స్, ఎక్సయిజ్ ట్యాక్స్, స్టేట్ జీఎస్టీ (SGST), స్టాంప్స్-రిజిస్ట్రేషన్ డ్యూటీ, రోడ్ ట్యాక్స్, మోటార్ వెహికల్ ట్యాక్స్.. ఇలా అనేక వాటిపై పడుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. రైతులు, గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి తగ్గితే కేవలం వ్యవసాయ రంగం మాత్రమే కాకుండా.. దానిపై ఆధారపడిన ఇతర రంగాలు, చిరు వ్యాపారాలు, అనుసంధానంగా ఉండే వృత్తులపై కూడా ప్రభావం పడనున్నది. దీంతో బడ్జెట్ తారుమారు అయ్యే అవకాశం ఉందని అధికారుల్లో ఆందోళన మొదలైంది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థే మూలస్తంభం
రాష్ట్ర జీఎస్‌డీపీలో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా ప్రత్యక్షంగా 18 శాతం ఉన్నప్పటికీ, గ్రామీణ వినియోగాన్ని నడిపించే ప్రధాన శక్తి వ్యవసాయమే. కోట్లాది ప్రజల ఆదాయం వ్యవసాయంతోనే ముడిపడి ఉన్నది. వర్షాలు ఆలస్యమైతే మొదట దెబ్బతినేది రైతు ఆదాయమే. కానీ అది గ్రామీణుల కొనుగోలు శక్తి మొదలు వాహనాల కొనుగోలు, మద్యం అవసరాల వరకు ప్రభావం చూపుతుంది. రబీతో పోలిస్తే ఖరీఫ్ సీజన్‌పై రైతులు ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారు.
వర్షాలు పుష్కలంగా కురుస్తాయని, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుందని, కాల్వల ద్వారా నీరు అందుతుందని.. ఇలాంటి అంచనాలతో సాగుపై కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. సీజన్ ప్రారంభంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ట్రాక్టర్లు, డీజిల్, కూలీలపై ఖర్చు చేస్తారు. ఇలాంటి ఖర్చులే గ్రామీణ మార్కెట్‌లో నగదు ప్రవాహాన్ని పెంచుతాయి. కానీ వర్షాభావం కారణంగా సాగు వాయిదా పడుతున్నాకొద్దీ రైతులు పెట్టే ఖర్చు పరిమితమవుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
వ్యవసాయ కూలీలకు ఉపాధి తగ్గడం, వాళ్ల చేతిలో డబ్బు లేకపోతే గ్రామాల్లో కిరాణా దుకాణాల మొదలు దుస్తుల కొనుగోలు, చిరు వ్యాపారం, వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాలు, ఆటో డ్రైవర్లు, చిన్న హోటళ్లు, నిర్మాణ రంగం.. ఇలా అన్నీ ప్రభావితమవుతాయని చెబుతున్నారు. గ్రామీణ మార్కెట్‌లో వినియోగం తగ్గడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మొదటి హెచ్చరికగా మారుతుందని పేర్కొంటున్నారు.
ఇలాగే కొనసాగితే భారీ నష్టం
ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గి, వర్షాభావ పరిస్థితులు ఆగస్టు వరకు కొనసాగితే గ్రామీణ వినియోగంలో దాదాపు 8% డౌన్ ఫాల్ ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వసూలయ్యే పన్నులు తగ్గొచ్చని, అది మొత్తం బడ్జెట్ ప్రణాళికపైనే ప్రభావం చూపుతుందని అంటున్నారు. దీంతో ప్రభుత్వంపై ఆదాయం కోసం ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుందని, ఆ ప్రభావం సంక్షేమ పథకాల అమలు లేదా ప్లానింగ్‌లో పెట్టుకున్న కొన్ని హామీలపై పడొచ్చని చెబుతున్నారు.
ఎల్‌నినో ఎఫెక్ట్ ప్రత్యక్షంగా వ్యవసాయ రంగానికి వర్తిస్తున్నా పరోక్షంగా అనేక రంగాలపై ప్రభావం చూపుతుంది. ప్రజాకవి కాళోజీ దీన్ని తనదైన శైలిలో “కర్షకా.. నీ కర్రు కదిలినన్నాళ్లే దేవుళ్ల తిరునాళ్లు, దివ్య నది తీర్థాలు.. తాత్వికుని తత్వాలు, మాంత్రికుని మంత్రాలు.. దాంభికుని ధ్యానాలు, ఛాందసుని జాతకాలు,.. ధార్మికుని దానాలు, పండితుని భాష్యాలు.. వర్తకుని వ్యాజ్యాలు, వకీల్ల వాదాలు.. సైనికుని శౌర్యాలు, యాంత్రికుని యంత్రాలు..” అంటూ వ్యవసాయం ఏయే రంగాలను ఎలా ప్రభావితం చేస్తుందో వివరించారు.
ఆర్థిక శాఖ సమీక్ష తర్వాతే క్లారిటీ
ఎల్‌నినో ఎఫెక్ట్‌తో రాష్ట్ర ఆదాయంపై ఎంత మేర ప్రభావం పడుతుందనేది ఆర్థిక శాఖ సమీక్ష తర్వాత క్లారిటీ రానుంది. ప్రస్తుతం వర్షపాత పరిస్థితుల ఆధారంగా వేసుకుంటున్న అంచనాలకు తోడు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం రూపొందించే నివేదికపై ఆర్థిక శాఖ సమీక్ష చేపట్టనున్నది.ఆ తర్వాత ఆదాయానికి ఎంత మేర గండి పడే అవకాశముందో స్పష్టతకు వస్తుంది. ఇప్పటికే ఆర్థిక వనరుల సమీకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఏయే రూపాల్లో అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చో మార్గాలను కనిపెట్టేందుకు ఈ సబ్ కమిటీ పలుమార్లు సమావేశమైంది. ఇప్పుడు ఊహించని తీరులో ఎల్‌నినో రావడంతో దాని ప్రభావం ఖజానాపై ఏ మేరకు ఉంటుందనేది మరికొన్ని రోజుల్లో తేలనున్నది.

