కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండలోని హనుమాన్ నగర్ కు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని పొనుగంటి నిరంజన్ (17) (Pawan Kalyan Fan Niranjan) మృతి చెందాడు. గత కొంతకాలంగా అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. నిరంజన్ మృతితో హనుమకొండలోని హనుమాన్ నగర్ లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. నిరంజన్ మృతి పట్ల స్థానికులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాగా, అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన నిరంజన్‌ను జూన్ 17న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా అతని నివాసంలో పరామర్శించారు.అతడిని ఆత్మీయంగా హత్తుకుని పవన్ కళ్యాణ్ ధైర్యం చెప్పారు. ఒకవేళ తాను ఓజీ 2 తీస్తే అందులో నువ్వే నా స్పెషల్ గెస్ట్ అంటూ నిరంజన్ కు ప్రేమతో మాటిచ్చారు. ఈ క్రమంలోనే నిరంజన్‌కు బహుమతులు అందించిన పవన్ కళ్యాణ్.. వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు.

