కలం, ఢిల్లీ బ్యూరో : రాబోయే పార్లమెంటు ఎన్నికలను ‘జమిలి’ (Jamili elections) తరహాలో నిర్వహించేందుకే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నది. ప్రత్యేక చట్టం చేయాల్సి ఉన్నందున వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు రావచ్చన్న ఊహాగానాలు వచ్చాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు తక్కువగా ఉన్నాయని జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పీపీ చౌదరి (JPC Chairman PP Chaudhary) పేర్కొన్నారు. ఈ బిల్లు ఇప్పుడు రాకపోయినా జమిలి ఉండదనే అభిప్రాయానికి రావాల్సిన అవసరం లేదన్నారు.
బిల్లు లేనందున జమిలి జరగదేమో అనే ఆందోళన కూడా అవసరం లేదన్నారు. పార్లమెంటు 2028 జూలైలోనే ‘జమిలి’ బిల్లును ఆమోదించినా 2029 సాధారణ ఎన్నికల్లో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను కలిపి నిర్వహించడానికి రాజ్యాంగపరంగా, పరిపాలనాపరంగా ఎలాంటి ఆటంకాలు ఉండవని పేర్కొన్నారు. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ పై కసరత్తు కొనసాగుతూనే ఉన్నదని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సంస్కరణ అమలుపై ఆయన మాటల ద్వారా పరోక్షంగా కీలక స్పష్టత వచ్చినట్లయింది.
దేశవ్యాప్తంగా జమిలి ఒక అవసరమైన సంస్కరణ :
జమిలి ఎన్నికల (Jamili elections) అమలు కోసం జరుగుతున్న ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతూ ఉన్నదని ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి వివరించారు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని అవసరమైతే తగ్గించడం ద్వారా 2029లోనే లోక్‌సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించవచ్చని అభిప్రాయపడ్డారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ సంస్కరణ తప్పనిసరిగా అమలు కావాలన్నారు.
జమిలి ఎన్నికల వల్ల దేశం నిరంతరం ఎన్నికల మోడ్‌లో ఉండే పరిస్థితిని తొలగించినట్లవుతుందన్నారు. తరచూ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం తగ్గుతున్నందున ఎన్నికల ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పదేపదే ఎన్నికల విధులకు మళ్లించాల్సిన పరిస్థితీ ఉండదన్నారు. ఎలక్షన్ కోడ్ కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడం, విధాన నిర్ణయాల్లో జాప్యం లాంటి సమస్యలు కూడా తగ్గుతాయన్నారు.
భాగస్వాములతో జేపీసీ విస్తృత సంప్రదింపులు :
జమిలి ఎన్నికల బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ మాజీ ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, లా కమిషన్ మాజీ, ప్రస్తుత సభ్యులు, ప్రముఖ న్యాయవాదులు, ఆర్థిక నిపుణులు, మాజీ విధాన రూపకర్తలతో విస్తృతంగా చర్చలు జరిపింది. మాజీ ప్రధాన న్యాయమూర్తులు జేఎస్ ఖేహర్, రంజన్ గొగోయ్, డీవై చంద్రచూడ్, యూయూ లలిత్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్‌తో పాటు మాజీ న్యాయమూర్తులు బీఎస్ చౌహాన్, హేమంత్ గుప్తా, న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ దినేశ్ మహేశ్వరి, సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ, అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి అభిప్రాయాలను కమిటీ సేకరించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మాజీ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్, మాజీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ఆర్థికవేత్త అరవింద్ పనగారియా, ఎన్‌కే సింగ్, సంజీవ్ సన్యాల్ వంటి ప్రముఖ ఆర్థిక నిపుణులతోనూ కమిటీ చర్చలు జరిపి వారి అభిప్రాయాలను సేకరించింది.
రాష్ట్రాల పర్యటనలు.. ప్రజాభిప్రాయ సేకరణ :
మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, చండీగఢ్ తదితర రాష్ట్రాల్లో కమిటీ పర్యటించి ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, అసెంబ్లీ స్పీకర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పౌరసంఘాల ప్రతినిధులతోనూ జేపీసీ సమావేశమైంది. ఢిల్లీ, గోవా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలతో మాత్రమే సంప్రదింపులు జరపాల్సి ఉందని పీపీ చౌదరి తెలిపారు. అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించిన తర్వాతే జేపీసీ తన తుది నివేదికను పార్లమెంటుకు సమర్పించనున్నట్లు చెప్పారు.
రాజకీయ పార్టీలు మినహా పౌరసమాజం నుంచి వచ్చిన స్పందన జమిలి ఎన్నికలకు అనుకూలంగానే ఉందన్నారు. ప్రజల అభీష్టం కూడా ఇదేనని, ప్రజాస్వామ్యంలో తుది నిర్ణయం ప్రజల అభిప్రాయానికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. పీపీ చౌదరి పై అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో ప్రజాభీష్టం మేరకు జమిలి ఎన్నికల విధానాన్ని తీసుకొచ్చేలా కేంద్రానికి సిఫారసులు చేసే అవకాశమున్నది. బీజేపీ సైతం అనుకూలంగానే ఉన్నందున 2029 లోక్‌సభ ఎన్నికలు ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ సిస్టమ్ ప్రకారమే జరిగే అవకాశాలున్నాయి.

