కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : ధాన్యపు కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వనపర్తి (Wanaparthy) జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం పాన్గల్ మండలంలోని దవాజీపల్లి, పాన్గల్ ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో జరుగుతున్న కొనుగోలు తీరును, ధాన్యం నిల్వలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అధికారులకు, నిర్వాహకులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్ష సూచనలు ఉన్నందున కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వీలైనంత వేగంగా సేకరించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన ట్రక్ షీట్లను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని సూచించారు. తద్వారా రైతులకు సకాలంలో, త్వరగా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి వీలుగా తగినన్ని లారీలు, వాహనాలను అందుబాటులో ఉంచాలని వాహన కాంట్రాక్టర్లను అదనపు కలెక్టర్ ఆదేశించారు. రవాణాలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని హెచ్చరించారు. అనంతరం, సేకరించిన ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు వీలుగా వనపర్తి పరిధిలోని బసవేశ్వర రైస్ మిల్, మహాలక్ష్మి రైస్ మిల్‌తో పాటు వివిధ ప్రాంతాలను ఆయన సందర్శించారు. మిల్లుల్లో ధాన్యం దించుకోడానికి ఉన్న వసతులను, నిల్వ సామర్థ్యాన్ని పరిశీలించి, వేగంగా దించుకోవాలని, మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని మిల్లుల యజమానులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాధ్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.

