కలం, వెబ్ డెస్క్: నేటి డిజిటల్ యుగంలో చాలా మందిని వేధించే తీవ్రమైన తలనొప్పి సమస్యలలో మైగ్రేన్ ఒకటి. ఈ నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందేందుకు చాలా మంది మొదటగా వేడి వేడి కాఫీని ఆశ్రయిస్తారు. అయితే కాఫీతో నిజంగానే మైగ్రేన్ తగ్గుతుందా, అసలు కాఫీకి, మైగ్రేన్ కు ఉన్న సంబంధం ఏమిటి? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
కాఫీ మైగ్రేన్ నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు (Coffee for Migraine). అయితే ఇది అందరిలోనూ ఓకేలా ఉండదట. సాధారణంగా మైగ్రేన్ సమయంలో మెదడులోని రక్తనాళాలు విస్తరించి మనకు విపరీతమైన నొప్పి వస్తుంది. అయితే కాఫీలో ఉండే కెఫిన్ మెదడులోని రక్తనాళాలపై ప్రభావం చూపి నొప్పిని తగ్గించగల శక్తిని కలిగి ఉంటుంది. మెదడులోని అడెనోసిన్ రిసెప్టర్లను నిరోధించి రక్తనాళాలు కుంచించుకునేలా చేసి నొప్పిని తగ్గిస్తుంది. అందుకే తలనొప్పి నివారణ మందుల్లో కూడా కెఫిన్ ను ఉపయోగిస్తారని చెబుతున్నారు నిపుణులు.
అయితే మైగ్రేన్ బాధితులలో కాఫీ రెండు రకాలుగా పనిచేస్తుంది. కొందరికి కాఫీ తాగడం వల్ల వెంటనే ఉపశమనం కలిగితే, మరికొందరికి కాఫీ తాగిన వెంటనే మైగ్రేన్ నొప్పి ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే అలాంటి వారు కాఫీకి దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ప్రతి రోజూ ఎక్కువ మొత్తంలో కాఫీ తాగేవారు సడెన్ గా తాగడం మానేసినా, లేదా తగ్గించినా కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే ‘కెఫిన్ విత్‌డ్రావల్ హెడేక్’ అంటారు. అలాంటి వారు ఒకేసారి మానేయకుండా క్రమంగా తగ్గించడం మంచిదని చెబుతున్నారు.
అయితే మైగ్రేన్ ఉన్నవారు రోజుకు 1 లేదా 2 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగకూడదని సూచిస్తున్నారు. కాఫీ తాగిన తర్వాత మీ మైగ్రేన్ పెరుగుతుందో, తగ్గుతుందో గమనించి, ఒకవేళ తాగిన తర్వాత నొప్పి వస్తుంటే కాఫీకి పూర్తిగా దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు.

