కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నరసరావుపేట (Narasaraopet) కు చెందిన ప్రయాణికుల బస్సు బోల్తా పడింది. నైమిశారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తుండగా శుక్రవారం ఉదయం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో టూరిస్ట్ గైడ్ తో పాటు బస్సు డ్రైవర్ మృతి చెందినట్లు సమాచారం.
అలాగే, బస్సులో ఉన్న 50 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ నెల 20 వ తేదీ రాత్రి నరసరావుపేట నుంచి బయలుదేరిన యాత్రికులు గురువారం లక్నోకు చేరుకున్నారు. అనంతరం అయోధ్య మీదుగా నేపాల్ కు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయాలయిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం తెలుసుకున్న యాత్రకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

