కలం, వెబ్ డెస్క్ : మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో నేడు జరిగిన 49వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) శుభవార్త చెప్పారు. మహిళా ఆర్థిక సాధికారత కోసం రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచబోతున్నట్లు ప్రకటించారు. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఆర్థిక స్వావలంబన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మహిళా సాధికారత, మూసీ పునరుజ్జీవం వంటి అంశాలపై ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు.
వ్యవసాయ రంగానికి సంబంధించి లక్ష్యాలను మించి బ్యాంకులు రుణాలు ఇవ్వడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. పారిశ్రామిక రంగంలో దేశంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని తెలిపారు. ఈ నేపథ్యంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, మహిళలు, దళిత, గిరిజన యువ పారిశ్రామికవేత్తలకు రుణాల పంపిణీపై బ్యాంకులు మరింత దృష్టి పెట్టాలని భట్టి విక్రమార్క సూచించారు.
అలాగే విద్యార్థులకు ఇచ్చే రుణాల విషయంలో బ్యాంకులు మరింత సానుకూల దృక్ఫథంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ దాన కిషోర్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఫైనాన్స్ – ప్లానింగ్ సెక్రెటరీ గౌరవ్ ఉప్పల్, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ చిన్మయ మోహన్, ఎస్బీఐ సీజీఎం నీలేష్ ద్వివేది తదితరులు పాల్గొన్నారు.

