కలం, వెబ్ డెస్క్ : నర్మదా నది పునరుద్ధరణపై సుదీర్ఘకాలం పోరాటం చేసిన ‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమకారిణి మేధా పాట్కర్ (Medha Patkar) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాజిక కార్యకర్తగా ఆమెకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాంటి మేధా పాట్కర్ తాజాగా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కు లేఖ రాశారు. అందులో కీలక అంశాలను లేవనెత్తారు. మార్చి 13న ప్రభుత్వం నిర్వహిస్తున్న డీపీఆర్ ను విడుదల చేయబోతోంది. ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ కార్యక్రమానికి తనకు అధికారిక ఇన్విటేషన్ వచ్చిందని.. ప్రాజెక్టు గురించి తెలుసుకున్న తర్వాత కొన్ని విషయాలు సీఎం రేవంత్ దృష్టికి తీసుకొస్తున్నట్టు ఆమె వివరించారు.
‘మూసీ నది (Musi River) చుట్టూ ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులను ఈ ప్రాజెక్టులో పూర్తిగా పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. గతంలో గుజరాత్ లోని సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో హైకోర్టు ఆదేశాలతో అనేక మార్గదర్శకాలు, సవరణలు చేయాల్సి వచ్చింది. తెలంగాణ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో కూడా నిర్వాసితులను నిర్లక్ష్యం చేస్తున్నారు. గతంలో చాలా ప్రభుత్వాలు మూసీ ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని చూశాయి. కానీ నిర్వాసితులు ధర్నాలతో వెనక్కు తగ్గాయి. ఇప్పుడు మీ ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు వల్ల వేలాది కుటుంబాలు ఇండ్లు కోల్పోతున్నాయి. ఇప్పటికే 300 ఇళ్లు కూల్చేశారు. అందుకు బదులుగా ఇచ్చిన ఇండ్లు వారి అవసరాలకు సరిపోవట్లేదు’ అంటూ మేధా పాట్కర్ (Medha Patkar) తెలిపారు .
గాంధీ సరోవర్ ప్రాజెక్టును (Gandhi Sarovar Project) కూడా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్స్ నివాసితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని.. ఈ ప్రాజెక్టులో నిర్వాసితులతో చర్చలు జరపకుండానే ఇష్టారీతిన ముందుకెళ్తున్నారంటూ సీఎం రేవంత్ పై మేధా పాట్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నదిని పునరుద్ధరించడాన్ని తాను పూర్తిగా సమర్ధిస్తున్నానని.. కానీ పర్యావరణానికి, సామాన్య జనాలకు నష్టం జరగొద్దని సూచించారు.
ఈ ప్రాజెక్టు విషయంలో 2013 న్యాయ పరిహార హక్కు చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని.. నిర్వాసితులకు న్యాయం చేయాలని పాట్కర్ కోరారు. 2017లో తెలగాణ ప్రభుత్వం చేసిన సవరణ చట్టాన్ని పక్కన పెట్టాలని సూచించారు. ‘ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం ముందుకు వెళ్తున్న విధానాల వల్ల పర్యావరణానికి, తెలంగాణ సమాజానికి దీర్ఘాకాలికంగా నష్టాలు కలిగిస్తాయి. కాబట్టి ఈ ప్రాజెక్టు విషయంలో నేను కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాను. 2026 మార్చి 13న జరగనున్న ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని వెంటనే ఆపేయాలి. అందుకు బదులుగా మొత్తం ప్రాజెక్ట్‌కు సంబంధించిన డ్రాఫ్ట్ డీటైల్ ప్రాజెక్ట్ ప్లాన్‌ను ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో రిలీజ్ చేసి.. 60 రోజులపాటు ప్రజల అభిప్రాయాలు సేకరించాలి. ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్న మూసీ జనాందోళన్ ప్రతినిధులతో చర్చలు జరిపి వారి డిమాండ్లు నెరవేర్చాలి. అలాగే ఈ ప్రాజెక్ట్‌ను సమీక్షించేందుకు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి. అలాగే ప్రాజెక్ట్ కోసం భూముల స్వాధీనానికి నిర్వాసితులకు ఇచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించాలి’ అంటూ మేధా పాట్కర్ చెప్పుకొచ్చారు.
Read Also: తెలంగాణకు వాతావరణ హెచ్చరిక.. ఎండలు, ఆపై భారీ వానలు
Follow Us On : WhatsApp

