కలం, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ హయాంలో కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టులో కట్టిన మేడిగడ్డ (Medigadda Barrage) బ్యారేజ్ అత్యంత ప్రమాదకర (Dangerous) జాబితాలో చేరింది. తక్షణం దీనికి పనులు చేయకపోతే, ఒక ఏడాదిలోగా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ప్రమాదం పొంచి ఉంటుందని, దేనికీ పనికిరాకుండా పోతుందని కేంద్రం స్పష్టం చేసింది. అనేక లోపాలతో నిర్మాణమైన జాబితాలో ఈ ప్రాజెక్టు చేరినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశం మొత్తం మీద ఇలాంటి ప్రమాదకర ప్రాజెక్టులు/బ్యారేజీలు మూడు ఉంటే అందులో మేడిగడ్డ కూడా ఒకటి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గతేడాది డ్యామ్‌ల తాజా పరిస్థితిపై అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఈ అంశాన్ని పొందుపర్చినట్లు జలశక్తి మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి తెలిపారు. మిగిలిన రెండు ఉత్తరప్రదేశ్‌లోని లోయల్ ఖజూరి డ్యామ్, జార్ఖండ్‌లోని బొకారో బ్యారేజ్ అని తెలిపారు. డ్యామ్ రిహబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు (DRIP) స్కీమ్ కింద రూ. 100 కోట్లు మంజూరు చేసినా ఇప్పటికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని వివరించారు.
మేడిగడ్డపై నిపుణులు, కమిషన్ల రిపోర్టులు
మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేయడం మొదలు డిజైన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్‌లో లోపాలున్నట్లు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ఎంక్వయిరీ కమిషన్ తేల్చింది. ఇరిగేషన్ నిపుణులతో పాటు సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఇచ్చిన డిజైన్లను కాదని అప్పటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం, దానికి తోడు నిర్మాణం సమయంలోనే పలుమార్లు మార్పులు చేయడం పెద్ద తప్పిదమని ఆ నివేదికలో జస్టిస్ ఘోష్ తెలిపారు. మూడేండ్ల వ్యవధిలోనే పిల్లర్లు కుంగడం, బ్యారేజీకి పగుళ్ళు రావడంపై విస్మయం వ్యక్తం చేసిన నేషనల్ డ్యాప్ సేఫ్టీ అథారిటీ నిపుణులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి దిద్దుబాటు చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. రిపేర్ పనుల కోసం రాష్ట్ర సర్కార్ సైతం టెండర్లు పిలిచింది. వీలైనంత తొందరగా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నది. ఇదే సమయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ లోక్‌సభ వేదికగా ప్రమాదకరమైన ప్రాజెక్టుల జాబితాలో మేడిగడ్డను చేర్చడం గమనార్హం.
Read Also: డంబెల్‌తో మోది మహిళా కమాండో దారుణ హత్య
Follow Us On: X(Twitter)


