కలం, డెస్క్ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Venkat Reddy కీలక వ్యాఖ్యలు చేశారు. తాను విద్యాశాఖ మంత్రిని అయితే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లను మొత్తం బంద్ చేయిస్తానని చెప్పారు. తన కొడుకు కోమటిరెడ్డి ప్రతీక్ పేరుమీద నల్గొండ జిల్లా బొట్టుగూడలో ప్రభుత్వ స్కూల్ ను రూ.8 కోట్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Venkat Reddy) కట్టించారు. నేడు ఆ స్కూల్ బిల్డింగ్ ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ స్కూళ్లలో ఉండేవి మూడు రూములే గానీ.. ఫీజులు రూ.3లక్షల మీద తీసుకుంటున్నారు. అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయమేస్తోంది. నా అభిమానులు, కార్యకర్తలు ఆ స్కూళ్లకు వెళ్లి ఫీజులు ఎక్కువగా ఉన్నాయి సార్.. కొంచెం మీరు చెప్పండి అని ఫోన్లు చేస్తారు. నేను మాట్లాడితే లక్ష తగ్గించి 2 లక్షలకు సెట్ చేస్తామని అంటారు. కానీ వాస్తవానికి ఫీజు 2 లక్షలే ఉంటుంది. నేను ఫోన్ చేస్తా అని తెలుసు కాబట్టి 3 లక్షలు చెప్తారు. కార్పొరేట్ స్కూల్ వాళ్లందరూ దొంగలే. వాళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. విద్యా అనేది వ్యాపారం కాదని గుర్తుంచుకోవాలి. పేద పిల్లలకు 25 శాతం ఉచిత సీట్లు ఇవ్వాలని చట్టం చెబుతున్నా ఎవరూ అమలు చేయట్లేదు’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
ఇప్పుడున్న కార్పొరేట్ స్కూళ్లలో టీచర్లు ఇంటర్, డిగ్రీ చదివిన వారే ఉంటారని.. ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం పీహెచ్ డీ చేసిన వారు ఉంటారంటూ తెలిపారు మంత్రి కోమటిరెడ్డి. అసలు కార్పొరేట్ స్కూళ్లకు స్టూడెంట్లను ఎందుకు పంపుతున్నారో అర్థం కావట్లేదని.. బట్టి చదువులతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు తెలిపారు మంత్రి. ఇలాంటి పరిణామాలు సమాజానికి అస్సలు మంచివి కావని.. రాబోయే తరం విద్యతో పాటు అన్ని రంగాల్లో ఆరితేరాలని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తన కొడుకు పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని.. అది తనకు చాలా సంతోషాన్ని ఇస్తున్నట్టు తెలిపారు. పేద పిల్లల చదువుకోసం ఎంత వరకు అయినా వెళ్తానని.. చదువు మాత్రమే పిల్లల భవిష్యత్తును మార్చుతుందని చెప్పుకొచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.


