కలం, ఖమ్మం బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో దివ్యాంగుల కోసం రూ. 100 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. మంగళవారం మధిర (Madhira) నియోజకవర్గ కేంద్రంలో ఆయన దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. చదువుకుంటున్న దివ్యాంగులకు ఐపాడ్లు, కంప్యూటర్లు, ట్యాబ్స్ ప్రజా ప్రభుత్వం అందిస్తోందన్నారు. ప్రజా ప్రభుత్వంలో దివ్యాంగులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామని వారికి అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం అందిస్తుందని భట్టి హామినిచ్చారు.
దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో పుట్టిన వారిని కూడా సమాజంలో మనతో పాటు ముందుకు నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దివ్యాంగుల గురించి సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని సూచించారు. దివ్యాంగులు కూడా అన్ని రంగాలలో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ తెలిపారు. సమాజంలో ఇతరులు కన్నా ఎక్కువ అవకాశాలను, ఆసరాను దివ్యాంగులకు అందించాలన్నారు. అంగవైకల్యంతో ఉన్నామన్న బాధ వారికి రాకుండా వారిని ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఈ ఆలోచన దిశగానే ముందుకు సాగుతోందని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు.


