కలం, వెబ్ డెస్క్ : డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సరిహద్దుల్లో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అక్రమ వలసదారుల్ని పట్టుకుని విమానాల్లో స్వదేశాలకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో అక్రమ వలసదారులకు ట్రంప్ సర్కార్ బంపర్ ఆఫర్ (US Immigration Policy) ప్రకటించింది. అక్రమ వలసదారుల కోసం ‘‘ఎగ్జిట్ బోనస్ స్కీమ్’’ను తీసుకొచ్చినట్లు ఓ ప్రకటన చేసింది. ఈ స్కీమ్ ద్వారా స్వచ్ఛందంగా యూఎస్ ను వీడేవారికి రూ.2.40 లక్షల నగదు ప్రోత్సాహాకాన్ని అందిస్తామని తెలిపింది.
అంతేకాదు సీబీపీ హోమ్ యాప్ (CBP Home App) ద్వారా దరఖాస్తు చేసుకుంటే వలసదారులకు ఉచిత విమాన ప్రయాణ కల్పిస్తామని అమెరికా ప్రభుత్వం తెలిపింది. అరెస్ట్‌లు లేకుండా ప్రాజెక్ట్ హోమ్ కమింగ్ స్కీమ్ ద్వారా స్వదేశాలకు చేర్చనున్నట్లు పేర్కొంది. కాగా, అక్రమ వలసలను తగ్గించేందుకు ఇది సమర్థవంతమైన మార్గమని డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటనలో తెలిపారు. స్కీమ్ (US Immigration Policy)లో భాగంగా ఎవరినీ అరెస్ట్ చేయకుండా స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేలా ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. ఇదిలాఉంటే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. ఈ ప్రతిపాదన అమలు అయితే అమెరికాలో ఉన్న అక్రమ వలసదారుల సమస్యకు కొంతమేర పరిష్కారం లభించే అవకాశం ఉందని పలువురు నిపుణులు భావిస్తున్నారు.

