కలం, వరంగల్ బ్యూరో : మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) పేర్కొన్నారు. వరంగల్ (Warangal) లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని “ఈద్ కా తోఫా”(Eid Ka Tohfa) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని క్రిస్టల్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పేద ముస్లింలకు దుస్తులను బహుమతులుగా అందజేశారు.
మంత్రి మాట్లాడుతూ.. రంజాన్(Ramzan) పర్వదినం ప్రేమ, దయ, త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని, సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. పండుగల సందర్భంగా అవసరమైన సహాయం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని, మైనార్టీల అభివృద్ధికి ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. మంత్రుల నియోజకవర్గాలకు 3500 “ఈద్ కా తోఫా”ల పంపిణీకి సహకరించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈద్ పండుగ అందరికీ శాంతి, సౌభాగ్యాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద (Satya Sarada) మాట్లాడుతూ, రంజాన్ మనుషుల్లో కరుణ, పరస్పర గౌరవాన్ని పెంపొందించే పవిత్ర పర్వదినమని చెప్పారు. సమాజ అభివృద్ధికి పరస్పర సహకారం అవసరమని, ప్రభుత్వ పథకాలు అందరికీ చేరేలా అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. పండుగలు సమాజాన్ని ఏకం చేసే వేదికలని, ఇలాంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను బలపరుస్తాయని పేర్కొన్నారు.

