కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఊహించినట్లుగానే కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే రాజ్యసభ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. ఆయన తర్వాత కల్వకుంట్ల కవితకు (Kavitha) ఇవ్వొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో తన భర్త ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు ఆమె బహిరంగంగానే కామెంట్ చేశారు. దీని ఆధారంగా ఆమెకు కూడా సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం నోటీసు ఇచ్చి ఆమె నుంచి వివరణను, ఆధారాలను తీసుకుని స్టేట్‌మెంట్ రికార్డు చేసే అవకాశమున్నది. ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ (SIT) వేస్తే వివరాలు ఇవ్వడానికి సిద్ధమేనంటూ గతంలోనే ఆమె స్పష్టం చేశారు. ఆమెతో పాటు భర్తను కూడా విచారణకు పిలిచే అవకాశమున్నది.
ఆమె ఇచ్చే వివరణపైనే సర్వత్రా ఉత్కంఠ :
ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ఇప్పటివరకు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లను, బీఆర్ఎస్ లీడర్లను, కొద్దిమంది బాధితులను ఎంక్వయిరీకి పిలిచి విచారించిన సిట్ వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. ఇంతకాలం బీఆర్ఎస్‌లో ఉండి ఇప్పుడు సస్పెన్షన్‌కు గురై ఆగ్రహంతో ఉన్న కవితకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఎంక్వయిరీలో ఎలాంటి వివరాలను వెల్లడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేలా ఏవైనా ఆధారాలను ఇస్తారా అనే చర్చ జరుగుతున్నది. ఆమె వెల్లడించే అంశాలకు అనుగుణంగా తదుపరి నోటీసులు ఎవరికి ఉంటాయనే మాటలూ వినిపిస్తున్నాయి. “ఇంటి అల్లుడి ఫోన్‌ను ట్యాపింగ్ చేయడానికి సిగ్గుండాలి.. కేటీఆర్ భార్య ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తే ఆయన ఊరుకుంటారా?..” అంటూ కవిత ఇటీవల ఘాటుగా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే.
ఆమె నోరు విప్పితే చిక్కులెవరికి? :
బీఆర్ఎస్ నేతలు ఎలాగూ ఫోన్ ట్యాపింగ్ గురించి పాజిటివ్‌గా స్పందించే అవకాశం లేదు. కానీ ఇంతకాలం బీఆర్ఎస్‌లో ఉండి ఇటీవలే బైటకు వచ్చిన కవిత (Kavitha) గతంలోని వివరాలను ఏకరువు పెడితే పోలీసులకు అది అస్త్రంలా మారుతుంది. ఆమె స్టేట్‌మెంట్ ఈ కేసు దర్యాప్తులో కీలకం కానున్నది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉండింది?.. 2018 ఎన్నికల సమయంలో అది ఏ స్థాయికి చేరుకున్నది?.. బీఆర్ఎస్ ఎవరిని టార్గెట్‌గా చేసుకున్నది?.. ఏ ప్రయోజనాలను ఆశించింది?.. ఆ ప్లాన్‌తో బీఆర్ఎస్‌కు ఏ మేరకు లబ్ధి కలిగింది?.. ఏయే రూపాల్లో బెనిఫిట్ అయింది?.. ఎవరిపై ఎలాంటి ఒత్తిడి తెచ్చింది?.. ఇలాంటివన్నీ ఆమె నుంచి పోలీసులు రాబట్టే అవకాశమున్నది. పోలీసుల దగ్గరున్న ఆధారాలను ముందు ఉంచి ఆమె నుంచి రూఢీ చేసుకునే అవకాశమూ లేకపోలేదు.
Read Also: భారత్ తో అమెరికాది చరిత్రాత్మక బంధం : డొనాల్డ్ ట్రంప్
Follow Us On : WhatsApp


