epaper
Wednesday, January 21, 2026
spot_img
epaper

ఫోన్ ట్యాపింగ్ విచారణ అంతా డ్రామా: కవిత

కలం, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ విచారణ అంతా ఓ డ్రామా అని కవిత (Kavitha) ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టేందుకే విచారణ పేరుతో హడావుడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారని మండిపడ్డారు. ’గుంపు మేస్త్రీ, గుంటనక్క కలిసి ఆడుతున్న డ్రామా‘ అంటూ కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతున్న తీరుపై ఆమె స్పందించారు. తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కవిత పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణ అంతా రేవంత్ రెడ్డి, హరీశ్ రావు కలిసి ఆడుతున్న డ్రామా అని పేర్కొన్నారు. ఈ విచారణ వల్ల తనలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక విచారణలు చేసి ఏం తేల్చిందని ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషన్, ఈ కార్ రేస్ ఇటువంటి విచారణలు ఏం సాధించాయని పరోక్షంగా కవిత ప్రశ్నించారు.

బీసీలకు అన్యాయం

బీసీలకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్యాయం చేసిందని విమర్శించారు.  ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ 42 శాతం రిజర్వేషన్ మాట ఎత్తకుండానే ముందుకు వెళ్తోందని విమర్శించారు. ఈ విషయాన్ని బీసీలు ప్రశ్నించకూడదనే ఫోన్ ట్యాపింగ్ డ్రామా మొదలు పెట్టారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) పట్టణాల్లో జరుగుతాయి కనుక ప్రజలను డైవర్ట్ చేయటానికే ఈ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. అసలు బీసీల కోసం బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించటం లేదని నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు బీసీలకు ద్రోహం చేస్తున్నాయన్నారు. ‘ముచ్చర్ల సత్యనారాయణ బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేశారు. ఆయన లాంటి ఎంతో మంది ఉద్యమ నేతలకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది. ముచ్చర్ల విగ్రహాన్ని ట్యాంక్ బండ్ వద్ద పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మేము అధికారంలోకి వస్తే శ్రీకాంతా చారి జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తాం. బీసీ కులగణనలో బీసీల సంఖ్య తక్కువ చూపి కాంగ్రెస్ మోసం చేసింది. కేంద్రం చేపట్టే కులగణన ద్వారా ఆ మోసాన్ని బయటపెట్టే అవకాశం వచ్చింది.’ అంటూ కవిత వ్యాఖ్యానించారు.

మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై Kavitha క్లారిటీ

జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అవతరించలేదని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ, యువత, మహిళలు ఎవరైనా తమను సంప్రదిస్తే మున్సిపల్ ఎన్నికల్లో వారికి మద్దతిస్తామని చెప్పారు. తనతోపాటు పాటు జాగృతి నాయకులు వారి కోసం ప్రచారం చేస్తామన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువత, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మున్సిపల్ ఎన్నికలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. బీసీ బిడ్డలను కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేస్తోందని ఆరోపించారు. సికింద్రాబాద్ జిల్లా కావాలని అడిగిన వాళ్లను గత పదేళ్లలో బీఆర్ఎస్ అణిచివేసిందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మాత్రం సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా కావాలని కేటీఆర్ అడగటం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. రిజర్వేషన్ల పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి అంత తొందర ఏమిటని కవిత (Kavitha) ప్రశ్నించారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు వెళ్లాలని డిమాండ్ చేశారు.

జిల్లాల పునర్విభజన న్యాయం కాదు

ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాల పునర్విభజన (District Reorganization) ఇప్పుడు చేయడం సాధ్యం కాదన్నారు. కానీ ఎప్పుడు పునర్విభజన జరిగినా సరే సికింద్రాబాద్‌ను జిల్లా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కులగణనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. బీసీ కులాల లెక్కను తక్కువ చేసి చూపించి మోసం చేసిందని పేర్కొన్నారు. ‘ఈ విషయంలో బీసీలు, బీసీ మేధావులు ఆలోచించాలి. జాగృతి తరఫున బీసీల విషయంలో ఒక ముందడుగు వేస్తున్నాం. కులగణనలో పద్మశాలి సామాజిక వర్గం ఉంటే అందులో ఉండే ఉపకులాలను చూపిస్తూ తక్కువ గా చూపిస్తారు. జాగృతి తరఫున మేము ప్రతి కులానికి సంబంధించిన సమాచారం సేకరిస్తాం.’ అంటూ పేర్కొన్నారు.

Read Also: కేసీఆర్‌కూ SIT పిలుపొస్తుందా? గులాబీ శ్రేణుల్లో కలవరం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>