కలం, వరంగల్ బ్యూరో : ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, ఆకాశమే హద్దుగా ఎదగాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) సూచించారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం గొల్లకిష్టంపల్లి కస్తుర్భా గాంధీ పాఠశాలలో కలెక్టర్ స్నేహ శబరీష్ తో కలిసి కోటి 28 లక్షలతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జాతీయ బాలికా దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఆడపిల్లలు మగ పిల్లల కంటే ఏమాత్రం తక్కువ కాదని, ఏ రంగంలో చూసిన అగ్ర భాగం ఆడపిల్లలదే ఉందని తెలిపారు. ఆడపిల్లల విద్యను ప్రోత్సహిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారు అనడానికి ఉదాహరణ మన కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. అతిచిన్న వయసులో ఐఏఎస్ సాధించి మన జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్నారని తెలిపారు. పాఠశాలలో గ్రౌండ్ ల్యాండ్ లెవలింగ్, క్రీడా ప్రాంగణాల నిర్మాణం, గ్రీనరి ఏర్పాటు చేయాలని సూచించారు.
అలాగే గొల్లకిష్టంపల్లి కస్తూరిభా గాంధీ పాఠశాలకు ప్రత్యేకంగా 25కెవి ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసే విధంగా కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా రంగానికి పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ గురుకులాలు ఒకే చోట ఉండే ఒక్కో పాఠశాలను 200కోట్లతో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేస్తున్నట్లు కడియం (Kadiyam Srihari) వెల్లడించారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో గిరి రాజ్ గౌడ్ , పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సృజన, తహసీల్దార్ కొమి , ఎంపిడివో లక్ష్మీ ప్రసన్న, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్, ఇతర సర్పంచులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


