epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

40 ఏండ్లకే ఇంటికి.. టెకీలకు కంపెనీల షాక్!

కలం, తెలంగాణ బ్యూరో:  ఒకప్పుడు ఐటీ కంపెనీలో జాబ్ అంటే.. అదో ప్రెస్టేజ్ ! మా వాడు ఫలానా కంపెనీలో పనిచేస్తున్నాడు.. మా బిడ్డ బెంగళూరులో కొలువు చేస్తున్నది.. నెలకు మూడు నాలుగు లక్షల జీతం అని తల్లిదండ్రులు సహా కుటుంబసభ్యులు ఆనందపడేవారు. గొప్పగా చెప్పుకునేవారు!! కానీ.. రానురాను కార్పొరేట్ కంపెనీలు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. టెక్ దిగ్గజ కంపెనీలు కూడా ఉద్యోగాల్లో భారీగా కోత పెడ్తున్నాయి. కరోనా తర్వాత ఒక ఎత్తయితే.. ట్రంప్ రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మరో ఎత్తు.. అనే రీతిలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. 40 సంవత్సరాల వయసు వస్తే చాలు (New Layoff Age).. ‘‘ఇక చాలు.. ఇంటికి వెళ్లండి’’ అనే పరిస్థితి తలెత్తుతున్నది.

ఉద్యోగుల్లో భయం భయం

ఒకప్పుడు ఏ ఉద్యోగమైనా 58 నుంచి 60 ఏండ్ల వస్తే కానీ రిటైర్మెంట్ అనే ఆలోచన ఉండేది కాదు. కానీ, ఇప్పుడు అంతా ఆగమాగం అవుతున్నది. ఐటీ వంటి కార్పొరేట్ సెక్టార్ లో ‘ఏజ్ 40’ దాటితే చాటు రిటైర్మెంట్ అనే సిట్యువేషన్ నెలకొంది. పని భారం పెంచి, లేనిపోని తప్పులు చూపెట్టి బలవంతంగా కొందరిని.. చిన్నపాటి బెనిఫిట్స్ ఇచ్చి మరికొందరిని ఇంటికి కంపనీలు పంపిస్తున్నాయి. కంపెనీ మేనేజ్ మెంట్ నుంచి ఎప్పుడు ఏ మెయిల్ వస్తుందో.. ఎలాంటి కాల్ వస్తుందోనని.. 40 ఏండ్లు దాటిన టెకీలు (New Layoff Age) భయపడాల్సి పరిస్థితి ఏర్పడింది. ఐటీ మాత్రమే కాకుండా ఇతర కార్పొరేట్ కంపెనీలు కూడా ఇదే ఫార్ములాను అమలు చేస్తూ.. ఉద్యోగులను సాగనంపుతున్నాయి.

హఠాత్తుగా ఇంటికి!

బెంగళూరుకు చెందిన 43 ఏండ్ల టెకీ.. ఓ దిగ్గజ ఐటీ కంపెనీలో మిడ్ లెవల్ మేనేజర్ గా పనిచేసేవాడు. కంపెనీ ఎదుగుదలలో అతడి పాత్ర ఎంతో ఉంది. 22 ఏండ్ల వయసులో కంపెనీలో చేరాడు. ఇటీవల ఉన్నట్టుండి కంపెనీ మేనేజ్ మెంట్ నుంచి ఆయనకు కాల్ వచ్చింది. ‘‘మీరు అందించిన సేవలు వెలకట్టలేనివి. కంపెనీ ఉద్యోగాలను రీ స్ట్రక్చరింగ్ (Restructuring) చేయదలిచాం. మీ సేవలు, మీ అనుభవం ఇక మాకు చాలు. ఆ అనుభవాన్ని భరించే స్థాయి మాకు లేదు”.. ఇదీ ఆ కాల్ సారాంశం!! తప్పక, తప్పుకోలేక ఆ ఉద్యోగి జాబ్ నుంచి రిటైర్ కావాల్సి వచ్చింది. ఇలా.. ఒకరా ఇద్దరా?!! బెంగళూరు, కోల్ కతా, హైదరాబాద్ సహా అనే నగరాల్లోని పలు కార్పొరేట్ కంపెనీల్లో చాలా మంది ఉద్యోగులు ఇంటిబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. అగ్రశ్రేణి ఐటీ కంపెనీ టీసీఎస్ (TCS) గతేడాది ఏకంగా 30వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇందులో 40 ఏండ్ల నిబంధన కూడా ఉన్నట్లు ఐటీ వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది మరో 30 వేల మందిని తొలగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. విప్రో, ఇన్ఫోసిస్ సహా అనేక కంపెనీలు కూడా ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. అనుభవజ్ఞులను ఇంటికి పంపించేస్తున్నాయి.

ఎందుకిలా..!

సాధారణంగా ఉద్యోగికి 40 ఏండ్లు వచ్చాయంటే తన కెరీర్ పై మంచి పట్టు ఉంటుంది. మంచి అనుభవం ఉంటుంది. కానీ.. అలాంటి వారిని కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగిస్తుండటం ఆందోళనకరంగా మారింది. వారికి ఇచ్చే జీతంతో ఇద్దరిని కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోవచ్చని.. కాస్ట్ కటింగ్ లో ఇది భాగమని కంపెనీలు భావిస్తున్నాయి. సీనియర్ ఉద్యోగుల కంటే తక్కువ జీతానికి ‘యంగ్ అండ్ ఎనర్జిటిక్ ’ యూత్ ను పనిలో పెట్టుకుంటే తమకు మరింత ఫాయిదా ఉంటుందని, ఆర్థికంగా కూడా మిగులుబాటు ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నాయి.
– ప్రస్తుతం ఏఐ (AI) టెక్నాలజీ అందుబాటులోకి వస్తుండటంతో.. పాత టెక్నాలజీతో పనిలేదని, ఏఐ టెక్నాలజీ తరాన్ని ఉద్యోగంలో పెట్టుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. హ్యూమన్ పవర్ కు బదులు ఏఐ పవర్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి.
– అంతర్జాతీయంగా ఎప్పుడు ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయో అర్థం కావడం లేదని, ముందే అన్నీ సర్దుకుంటే బెటర్ అనే కోణంలో కంపెనీలు ఆలోచిస్తున్నాయి. ఈ కారణాల వల్ల 40 ఏండ్లకే టెకీలు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి తయారైంది.

లైఫ్ లో సెటిల్ కాకముందే..!

40 సంవత్సరాల వయసు అనేది ఎవరికైనా కీలకం. ప్రస్తుతం ఈ ఏజ్ లో ఎవరూ ఆర్థికంగా కానీ, కుటుంబ పరంగా కానీ పెద్దగా సెటిల్ అయిన దాఖలాలు ఉండవు. ఐటీ కంపెనీల్లో పేరుకు జీతం గొప్పగా ఉంటున్నా.. అది కొందరికి మాత్రమేనని టెకీలు వాపోతున్నారు. 40 ఏండ్లకే ఇంటికి పంపిస్తుండటంతో బయట మరో ఉద్యోగం దొరక్క దిక్కులు చూస్తున్నారు. చాలా మంది 30 నుంచి 35 ఏండ్ల వయసులోనే పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న ఐదారేండ్లకే ఉద్యోగం పోతుండటంతో కుటుంబ భారం పెరిగిపోతున్నది. పైగా, హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లకు ఈఎంఐల చెల్లింపులు కష్టంగా మారుతున్నాయి. పిల్లల చదువులకు, తల్లిదండ్రుల ఆరోగ్యపర ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వా మిగలడం లేదు. కొలువు చేస్తే కానీ ఇల్లు గడవని స్థితిలో చాలా మంది ఉన్నారు. 40 ఏండ్లలో ఎవరు కూడా ఆర్థికంగా సెటిల్ కారని.. ఇలాంటి టైమ్ వారి ఉద్యోగాలు పోతే బతుకులు రోడ్డున పడుతున్నాయని టెకీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: మీ ఆటలు సాగవు.. సీపీ సజ్జనార్​ వార్నింగ్​

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>