కలం, వరంగల్ బ్యూరో: మేడారం మహాజాతరలో ఇప్పుడు ఇప్ప పువ్వు లడ్డూ (Ippa Puvvu Laddu) స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. రెండేండ్లకు ఓ సారి వచ్చే ఈ జాతరకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం జాతరను ఘనంగా నిర్వహిస్తోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి సీతక్క ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని దగ్గరుండి జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ జాతరలో ఇప్పపువ్వు లడ్డూకు బాగా డిమాండ్ ఏర్పడింది.
ఇందిరా మహిళా శక్తి స్కీం కింద..
జనవరి 13న పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి స్కీం కింద మేడారం జాతరలో ఇప్పపువ్వు లడ్డు (Ippa Puvvu Laddu) స్టాల్‌లు తెరిచారు. గిరిజన ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా ఖ్యాతి దక్కలన్నా ఉద్దేశ్యంతో ఈ స్టాల్‌లను ప్రారంభించారు. అయితే భక్తుల నుంచి ఇప్పపువ్వు లడ్డూలకు అనూహ్య స్పందన వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. జాతరలో ఇప్పటివరకు దాదాపు రూ. 3 లక్షల విలువైన లడ్డూలు అమ్ముడుపోయాయని మహిళా సంఘాల సభ్యులు చెప్పారు. ఈ లడ్డూలో అత్యధిక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో భక్తులు వీటి మీద ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. లడ్డు అమ్మేందుకు ఆలయ పరిసరాల్లో మొత్తం 10 స్టాళ్లను ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పావుకిలో లడ్డూ ప్యాకెంట్ రూ. 150 రూపాయలకు అమ్ముతున్నారు.
క్యాబినెట్ సమావేశం అనంతరం గుర్తింపు
జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వం మేడారంలో క్యాబినెట్ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో లడ్డులను మంత్రులకు ప్రత్యేకంగా వడ్డించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర కేబినెట్ మంత్రులు లడ్డూలను రుచి చూశారు. అప్పట్లోనే ఈ వార్త చర్చనీయాంశం అయ్యింది. సమ్మక్క సారలమ్మ మహిళా రైతుల ఉత్పత్తి గ్రూప్ ఈ లడ్డూలను ఉత్పత్తి చేస్తోంది. ఈ గ్రూప్‌లో కందపర్తి, కన్నేపల్లి గ్రామాల పరిసరాల్లోని ఆదివాసీ మహిళలు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ సమగ్ర జీవనోపాధి ప్రోగ్రామ్ ఇందిరా మహిళా శక్తి కింద, ఐటీడీఏ ఉట్నూరు బృందం మహిళలకు ప్రత్యేక శిక్షణ అందించింది. ఆదివాసీ మహిళలకు ఆర్థికంగా స్వాతంత్ర్యం కల్పించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.
జీర్ణశక్తికి మేలు
ఇప్పపువ్వు లడ్డూ జీర్ణశక్తికి ఎంతో మేలు కలుగుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇమ్యూనిటీ పెంచేందుకు, షుగర్ వ్యాధిగ్రస్థులకు కూడా ఈ లడ్డు మేలు చేస్తుందని అంటున్నారు. పిల్లల ఎదుగుదలకు కూడా ఇప్పపువ్వు లడ్డూ ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. బరువు తగ్గించడానికి ఉపగయోగపడుతుందని చెబుతున్నారు. ఇక ఇప్పపువ్వు లడ్డూలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఈ లడ్డూలు ఎంతో ఉపయోగకరం. విటమిన్లు, మినరల్స్ ఉన్నందున గర్భిణులకు మేలు చేస్తాయి. దీంతో మేడారం వెళ్లే భక్తులు ఈ లడ్డూల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.
Read Also: రైతు చెంతకే ‘భూధార్’.. సర్వే వ్యవస్థలో విప్లవం: పొంగులేటి
Follow Us On : WhatsApp


