కలం, డెస్క్ : పాకిస్థాన్ మీద ఇండియా (India) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ తీరును ఎండగట్టింది. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ చట్టబద్ధం చేయాలని చూస్తోందని భారత్ తెలిపింది. ఐరాస భద్రతా మండలి మీటింగ్ లో పాకిస్థాన్ రాయబారి ఆసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాదాన్ని శిక్షించామని భారత్ (India) చెబుతున్నట్టు ఎక్కడా కనిపించట్లేదని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ప్రతిస్పందనతో ఆ విషయం తేలిపోయిందని చెప్పారు.
ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ధీటుగా సమాధానం ఇచ్చారు. పాకిస్థాన్ ఎల్లప్పుడూ భారత్ కు హాని కలిగించడమే పనిగా పెట్టుకుందని చెప్పారు. భారత్ అంతర్గత వ్యవహారంలో పాకిస్థాన్ జోక్యం చేసుకోవద్దని సూచించారు హరీష్. ఆపరేషన్ సిందూర్ తో భారత్ వైఖరి ఏంటో ప్రపంచానికి అర్థమైపోయిందని చెప్పారు. ఉగ్రవాదానికి భారత్ ఎప్పుడూ వ్యతిరేకమే అని చెప్పారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వల్లే సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసినట్టు తెలిపారు హరీష్.


