కలం, తెలంగాణ బ్యూరో: యూరోపియన్ యూనియన్ తో కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (India EU Trade Deal) మన దేశంలోని పరిశ్రమలకు వరంగా మారనుంది. ‘మేడిన్ ఇండియా’ ఉత్పత్తులకు ఈయూలోని 27 దేశాల్లో మంచి డిమాండ్ లభించనుంది. ముఖ్యంగా దుస్తులు, లెదర్, ఆభరణాల తయారీదారులకు ప్రోత్సాహం దొరకనుంది. ప్రస్తుతం భారతీయ వస్త్రాలపై యూరప్ లో 10 నుంచి 12 శాతం వరకు టారిఫ్ ఉంది. బంగ్లాదేశ్, వియత్నాం వస్త్రాలకు అక్కడ ఎలాంటి టారిఫ్ లేదు. దీంతో ఇన్నాళ్లు మన వస్త్రాల కన్నా బంగ్లాదేశ్, వియత్నాం దేశాల ఉత్పత్తులకే ఈయూ దేశాల్లో భారీగా గిరాకీ ఉండేది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల త్వరలో మన వస్త్రాలపై కూడా టారిఫ్ జీరో కానుంది. దీంతో రాబోయే మూడేండ్లలో భారతీయ వస్త్ర రంగంలో ఎగుమతులు రెట్టింపు అవుతాయని, టెక్స్ టైల్స్ వ్యాపారులకు లాభాల పంట పండుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
వేటిపై ఎంత..?
ఈయూ దేశాలకు మన నుంచి ఎగుమతి అయ్యే లెదర్, ఫుట్ వేర్ కు అక్కడ 17 శాతం వరకు టారిఫ్ విధిస్తున్నారు. తాజా ఒప్పందం ప్రకారం వీటిపై టారిఫ్ ను పూర్తిగా ఎత్తివేయనున్నారు. మన దగ్గర తయారయ్యే ఆభరణాలకు కూడా ప్రస్తుత ట్రేడ్ డీల్ (India EU Trade Deal) మంచి లాభం చేకూర్చనుంది. యూరప్ లోని 27 దేశాల్లో మన ఆభరణాలు ఆదరణ ఉంది. అయితే.. వాటిపై ఇన్నాళ్లూ ఉన్న వివిధ రకాల సుంకాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. ఈయూతో కుదిరిన ఒప్పందం వల్ల కేవలం బడా బడా కంపెనీలకే కాకుండా చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు కూడా ఊతం లభిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాన్పూర్, ఆగ్రా, చెన్నై వంటి నగరాల్లో విస్తరించి ఉన్న లెదర్ ఇండస్ట్రీకి ఈ డీల్ బూస్టప్ లాంటిదని.. ఆయా పరిశ్రమలు మరింత విస్తరించేందుకు స్కోప్ ఉంటుందని పేర్కొంటున్నాయి. దీంతో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని భావిస్తున్నాయి.


