కలం, వెబ్‌డెస్క్: ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష అరికట్టేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకొచ్చిన సవరణలు (UGC Equity Regulations) రచ్చ రేపుతున్నాయి. ఈ ప్రతిపాదనలు అసంబద్ధంగా ఉన్నాయంటూ విద్యా సంస్థలు, విద్యార్థి సంఘాలతోపాటు బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యూఢిల్లీలోని యూజీసీ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం విద్యార్థులు ధర్నాకు దిగారు.
విద్యాసంస్థల్లో ఆత్మహత్యల కేసుల విచారణ సందర్భంగా.. స్టూడెంట్స్ సూసైడ్స్‌కు కుల వివక్ష కూడా ఒక కారణమని, దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో సూచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్యాంపస్‌లలో కుల వివక్ష తొలగించేలా ‘ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్–2026’ని యూజీసీ తీసుకొచ్చింది. అయితే, ఇందులోని అంశాలపై వివాదం రాజుకుంది.
యూజీసీ కొత్త నిబంధనల్లో ఏముంది?
- ఉన్నత విద్యాసంస్థల్లో ఈక్విటీ స్క్వాడ్స్/ కమిటీలు ఏర్పాటుచేయాలి.
- వివక్షపై ఫిర్యాదులకు 24 గంటల హెల్ప్‌లైన్ ఉండాలి.
- విచారణ గడువు లోపల ముగించాలి. దోషులుగా తేలితే శిక్షలు కఠినంగా అమలు చేయాలి.
- అవసరమైతే సంస్థలకు గుర్తింపు రద్దుచేయాలి. లేదా నిధులను ఆపేయాలి. ఇలాంటివి మరికొన్ని.
- ఈ కొత్త నియమాలు కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాలన్నింటికీ వర్తిస్తాయి.
దీంతో యూజీసీ మార్గదర్శకాలు ఇచ్చే స్థాయి నుంచి నిబంధనలు విధించే స్థాయికి వెళ్లిందని, తన పర్యవేక్షణను పెంచుకుందని విద్యాసంస్థలు ఆందోళన చెందుతున్నాయి. కొత్త నిబంధనల (UGC Equity Regulations) ను అవకాశంగా మలచుకొని తమకు ఇబ్బంది కలిగించవచ్చని అగ్రకుల విద్యార్థులు, కొన్ని విద్యార్థి సంఘాల నేతలు, బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు అంటున్నారు. దేశంలో వివక్షను ఎదుర్కొనేందుకు ఇప్పటికే అనేక చట్టాలు, కోర్టు తీర్పులు, రాజ్యాంగ రక్షణలు ఉన్నప్పుడు యూజీసీ కొత్తగా నిబంధనలు తీసుకురావడమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), 15 (కుల ఆధారిత వివక్ష నిషేధం), 17 (అస్పృశ్యత రద్దు) వంటి నిబంధనలను వాళ్లు ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం, ప్రభుత్వ ఉద్యోగ నియమావళి కూడా వివక్షపై పోరుకు ఉద్దేశించినవేనని చెబుతున్నారు. ఇవి విశ్వవిద్యాలయాలు సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు వర్తిస్తాయనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
కాగా, ఇప్పటికే చాలా కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ఈక్వల్ ఆపర్చునిటీ సెల్స్, యాంటీ ర్యాగింగ్ కమిటీలు, అంతర్గత ఫిర్యాదుల కమిటీలు, గ్రీవెన్స్ పోర్టల్స్ ఉన్నాయి. ఇప్పుడివన్నీ కాదని, యూజీసీ కొత్త నిబంధనలు తీసుకురావడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు యూజీసీ కొత్త ఈక్విటీ రెగ్యులేషన్స్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ సైతం దాఖలైంది.
Read Also: నా మూలాలు భారత్‌లో : ఆంటోనియో కోస్టా
Follow Us On: Pinterest


