కలం, నల్లగొండ బ్యూరో: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కన్నతల్లే కాలయముడిలా మారి తన ఇద్దరు బిడ్డలను అంతం చేయాలని చూసింది. ఈ ఘటనలో 14 ఏళ్ల కుమార్తె బలైపోగా, కొడుకు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన భువనగిరి మండలంలోని తుక్కాపురం గ్రామంలో చోటు చేసుకుంది. బీబీనగర్ మండలం జైనపల్లి మాజీ సర్పంచ్ బెజ్జంగి నరేందర్ రెడ్డి భార్య నీలిమ శనివారం రాత్రి నీలిమ పుట్టినిల్లైన తుక్కాపురం గ్రామానికి వచ్చారు. ఆదివారం ఉదయం ఆమె ఒక్కసారిగా ఆవేశానికి లోనై తన కుమార్తె బెజ్జంగి కీర్తన రెడ్డి (14) గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసింది. అనంతరం తన కుమారుడు అంశాంత్ రెడ్డి గొంతు కోయడానికి ప్రయత్నించగా బాబు ప్రతిఘటించి కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశాడు.
పిల్లలపై దాడి చేసిన వెంటనే నీలిమ ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. బాబు కేకలు విని లోపలికి వెళ్లిన గ్రామస్తులు రక్తపు మడుగులో ఉన్న కీర్తనను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉరికి వేలాడుతున్న నీలిమను కిందకు దించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందితురాలు నీలిమ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. కొంతకాలంగా నీలిమ మానసిక స్థితి సరిగా లేదని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. అయితే, కన్న బిడ్డ ప్రాణాన్ని తీసి, మరో బిడ్డను చంపబోయిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

