కలం, వెబ్‌డెస్క్: ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు (Elon Musk) షాక్. మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’కు చెందిన ఏఐ చాట్‌బాట్ గ్రోక్ (Grok) లో అశ్లీల కంటెంట్‌పై ఈయూ దర్యాప్తు ప్రారంభించింది. ఇటీవల గ్రోక్.. చిన్నారులు, మహిళల అసభ్య, అశ్లీల ఫొటోలు అందించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై యూరోపియన్ యూనియన్ విచారణకు దిగింది.
ఇందులో భాగంగా.. ఇప్పటికే ‘ఎక్స్’పై కొనసాగుతున్న అక్రమ కంటెంట్, సమాచార మానిప్యులేషన్‌కు సంబంధించిన విచారణను మరింత విస్తరిస్తున్నట్లు ఈయూ వెల్లడించింది. డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ (DSA) కింద ‘ఎక్స్’ తన చట్టబద్ధ బాధ్యతలు నెరవేర్చిందా? లేదా అనేది తేల్చనున్నట్లు చెప్పింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో అక్రమ కంటెంట్ వ్యాప్తి, ముఖ్యంగా మార్చిన అశ్లీల ఫొటోలు, బాలల లైంగిక దుర్వినియోగానికి దారితీసే కంటెంట్‌ను ‘ఎక్స్’ సరైన విధంగా నియంత్రించిందా? అనేదానిపై విచారణ జరపనుంది.
అమెరికా నుంచి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తమ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని ఈయూ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ యుద్ధం, వాణిజ్యం, గ్రీన్‌ల్యాండ్ వంటి అనేక అంశాల్లో ట్రంప్ పాలనతో ఈయూ ఇప్పటికే విభేదాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇది మరో వివాదంగా మారింది.
కాగా, గత డిసెంబర్‌లో డీఎస్‌ఏ నిబంధనలను ఉల్లంఘించినందుకు ‘ఎక్స్’పై సుమారు 140 మిలియన్ డాలర్ల జరిమానాను ఈయూ విధించిన సంగతి తెలిసిందే. వెరిఫైడ్ అకౌంట్లకు సంబంధించిన ‘బ్లూ చెక్‌మార్క్’ రూపకల్పనలో మోసం, పరిశోధకులకు పబ్లిక్ డేటా అందుబాటులోకి తేవడంలో వైఫల్యం వంటి అంశాలు ఉల్లంఘనల్లో ఉన్నాయని అప్పట్లో ఈయూ పేర్కొంది.
30 లక్షల అశ్లీల చిత్రాలు!
డిజిటల్ వివక్షను ఎదుర్కొనేందుకు పనిచేస్తున్న ‘సెంటర్ ఫర్ కౌంటరింగ్ డిజిటల్ హేట్’ (CCDH) గత గురువారం విడుదల చేసిన అధ్యయనం.. కేవలం కొన్ని రోజుల్లోనే గ్రోక్ (Grok) సుమారు 30 లక్షల మేర మహిళలు, పిల్లల అశ్లీల చిత్రాలను రూపొందించినట్లు అంచనా వేసింది.
Read Also: భారత్‌కు అమెరికా రిపబ్లిక్ డే విషెస్..!
Follow Us On: Instagram


