కలం, వెబ్ డెస్క్ : సింగరేణి బొగ్గు టెండర్లపై తీవ్ర వివాదం నడుస్తున్న టైమ్ లో.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజా భవన్ లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, శ్రీధర్ బాబులతో సమావేశం అయ్యారు. ఈ భేటీ చర్చనీయాంశం అవుతున్న సమయంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh kumar Goud) స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్నప్పుడు మంత్రులతో డిప్యూటీ సీఎం సమావేశం అయితే తప్పేంటని ప్రశ్నించారు. పరిపాలన విషయంలోనే మంత్రులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం అయ్యారని అనుకుంటున్నట్టు తెలిపారు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh kumar Goud).
ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో పలు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు సోమవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పార్టీ పరమైన అనేక విషయాలు చర్చించినట్టు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి వచ్చిన తర్వాత చర్చించి పార్టీ ఢిల్లీ అధిష్టానానికి వివరిస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరికీ నోటీసులు ఇవ్వాల్సిందే అని చెప్పారు మహేశ్ కుమార్ గౌడ్.


