కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) పట్టణంలో పోలీసుల పహారా (Police Protection) లో అధికారులు పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారు. ప్రకాష్ నగర్ రావిచెట్టు బజారు ప్రాంతంలో దశాబ్దాలుగా ఇళ్ళు నిర్మించుకొని జీవనం సాగిస్తున్న పేదలపై అధికారులు దౌర్జన్యం ప్రదర్శిస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్ళలో ఉన్నవారిని బలవంతంగా అరెస్ట్ చేసి జేసీబీలతో కూల్చివేతలు చేస్తున్నారంటూ నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. కాస్త సమయం ఇస్తే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు తీసుకుంటామని వేడుకున్నా.. వినిపించుకోవడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు.
ఇళ్ళు ఖాళీ చేయమని నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయంగా వేరే దగ్గర చోటు చూపించకుండా, పరిహారం ఇవ్వకుండా తమ ఇండ్లను అన్యాయంగా కూల్చేస్తున్నారని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం (Khammam) పట్టణం అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం రోడ్లను విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఇళ్ళు కోల్పోయిన పేదలకు పది రెట్ల నష్టపరిహారం అందిస్తామని ఇప్పటికే మంత్రి తుమ్మల ప్రకటించారు.
ఇటు నిర్వాసితుల మాటలు, అటు ప్రజా ప్రతినిధుల మాటలు పరస్పరం విరుద్ధంగా ఉండటంతో నష్ట పరిహారం పక్క దారి పట్టిందా అనే అనుమానం అక్కడి వారిలో వ్యక్తం అవుతుంది. మరో పక్క పోలీసులు కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. బాధితుల మాటలు వినడానికి కూడా వారు ప్రయత్నం చేయడం లేదు. కావున అధికారులు చొరవ తీసుకుని నిజమైన బాధితులకు పరిహారం అందేలా చూడాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: తప్పిపోయిన పిల్లల ఆచూకీ: కేవలం ఒక్క స్కాన్‌తోనే..
Follow Us On: Instagram


