కలం, వెబ్ డెస్క్: ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని రంగంపేటలో చంటి బిడ్డను ఎత్తుకొని విధులు నిర్వహించిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిని హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) అభినందించి సత్కరించారు. ఆమెతో ఫోన్‌లో మాట్లాడటమే కాకుండా గురువారం ఆమెను ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకున్నారు.
రెండు రోజుల క్రితం కానిస్టేబుల్ జయశాంతి (Constable Vijayashanti) కాకినాడ-సామర్లకోట రోడ్డులో ప్రయాణించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఓ అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. దీంతో జయశాంతి తన కొడుకు చంకలో ఎత్తుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు జయశాంతిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వీడియో కాస్తా హోం మంత్రి వంగలపూడి అనిత వరకూ వెళ్లింది. ఆమె ప్రత్యేకంగా జయశాంతికి ఫోన్ చేసి అభినందించారు. ఈ క్రమంలో జయశాంతి మిమ్మల్ని కలవాలని ఉందంటూ హోంమంత్రిని కోరారు. గురువారం ఉదయం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో జయశాంతి కుటుంబ సమేతంగా హోం మంత్రిని కలిశారు. వంగలపూడి అనిత వారితో కలిసి భోజనం చేసి, కానిస్టేబుల్ దంపతులకు నూతన వస్త్రాలు అందించి సత్కరించారు. జయశాంతిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ విధి నిర్వహణ పట్ల నిబద్ధతతో ఉండాలని సూచించారు.

Read Also: కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు
Follow Us On: Instagram


