కలం వెబ్ డెస్క్ : సీఎం బావమరిది బాగోతం బయటపెట్టినందుకే తనకు ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో నోటీసులు పంపించారని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆరోపించారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. మంగళవారం తన నివాసంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. సింగరేణి డబ్బుతో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆడుకుంటున్నారని విమర్శించారు. ఇష్టారీతిన వాటాలు పంచుకుంటూ మంత్రివర్గం అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు.
సింగరేణిలో వాటాల కోసం మంత్రులు తన్నుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు రాత్రి 9 గంటల సమయంలో నోటీసులు ఇచ్చి, ఉదయాన్నే విచారణకు రమ్మన్నారని చెప్పారు. న్యాయ వ్యవస్థపై నమ్మకంతోనే విచారణకు వెళ్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ అవినీతిపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు నోటీసులు పంపించారని ఆరోపించారు. ఎన్ని వేధింపులు చేసినా ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటోందని హరీష్ ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఈ వ్యవహారంపై లేఖ రాస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టిపెట్టకుండా ఇబ్బందులు పెట్టడానికే రేవంత్ కొత్త డ్రామాలు చేస్తున్నారని, ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.


