కలం, వెబ్ డెస్క్: 2025 సంవత్సరానికి గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025కు (Governor Awards) ఎంపికైన అవార్డు గ్రహీతల వివరాలను గవర్నర్ కార్యాలయం (లోక్‌భవన్) శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ 2024లో తొలిసారిగా ఈ అవార్డులను మొదలుపెట్టారు. తొలి ఏడాదిలో పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు అవార్డులు అందజేశారు. 2025 సంవత్సరానికి గాను మహిళా సాధికారత, గిరిజన అభివృద్ధి, రూరల్ హెల్త్, మెడికల్ ఫిలాంత్రపీ, కార్పొరేట్ వలంటీర్ రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలను అవార్డులకు ఎంపిక చేశారు. ఈ అవార్డుల కోసం గత ఏడాది నవంబర్‌లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో నామినేషన్లు స్వీకరించారు. ప్రముఖులతో కూడిన అవార్డుల ఎంపిక కమిటీ వాటిని క్షుణ్ణంగా పరిశీలించింది.
కమిటీలో ఉన్నది వీళ్లే..
అవార్డుల (Governor Awards) ఎంపిక కమిటీకి భారత ప్రభుత్వ మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (హైదరాబాద్) చైర్మన్ కే పద్మనాభయ్య (రిటైర్డ్ ఐఏఎస్) అధ్యక్షత వహించారు. మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీఆర్ బిశ్వాల్ (ఐఏఎస్–రిటైర్డ్), ప్రముఖ సామాజిక సేవకురాలు డాక్టర్ సునీతా కృష్ణన్, ఆరోగ్య సంరక్షణ నిపుణుడు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ రమేశ్ ఖాజా సభ్యులుగా వ్యవహరించారు. అవార్డు గ్రహీతలకు రూ.2 లక్షల నగదు బహుమతితోపాటు అవార్డు గ్రహీతల విశిష్ట సేవలను గుర్తించే ప్రశంసా పత్రం అందజేయనున్నారు. గణతంత్ర దినోత్సవం (జనవరి 26న) లోక్ భవన్‌లో నిర్వహించే ఎట్ హోం కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
అవార్డుకు ఎంపికైన వారి వివరాలు
1. రమాదేవి కన్నెగంటి- మహిళా సాధికారత, హైదరాబాద్
2. తోడసం కైలాస్- గిరిజన అభివృద్ధి, వాఘాపూర్, ఆదిలాబాద్ జిల్లా
3. డాక్టర్ ప్రద్యుత్ వాఘ్రే- రూరల్ హెల్త్ , మెడిరల్ ఫిలాంత్రపీ, హైదరాబాద్.
4. వీ రాజన్న- కార్పొరేట్ వాలంటీరింగ్ , హైదరాబాద్.
అవార్డుకు ఎంపికైన సంస్థలు
1. శ్రీ సాయి సోషల్ ఎంపవర్‌మెంట్ సొసైటీ – మహిళా సాధికారత, ఘట్‌కేసర్
2. ఇండిజీనియస్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ – గిరిజన అభివృద్ధి, గట్టుమల్ల (వీ),
భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా
3. రామదేవ్‌రావు హాస్పిటల్, హైదరాబాద్ – రూరల్ హెల్త్ & మెడిరల్ ఫిలాంత్రపీ
4. గివ్ ఫర్ సొసైటీ, ఘట్‌కేసర్ – కార్పొరేట్ వలంటీరింగ్


