కలం, వెబ్ డెస్క్ : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో గత పదేళ్లుగా జరిగిన అన్ని టెండర్లు, అధికారిక నిర్ణయాలపై సమగ్ర విచారణ జరిపించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి ఒక బహిరంగ లేఖ రాశారు.
నైనీ కోల్ బ్లాక్ వివాదంపై స్పందించి ఇద్దరు సభ్యుల విచారణ కమిటీని వేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ, ఈ విచారణ కేవలం ఒక అంశానికే పరిమితం కాకూడదని అన్నారు. 2014 నుండి ఇప్పటి వరకు సింగరేణిలో జరిగిన ప్రతి టెండర్ ప్రక్రియను పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు.
గత పదేళ్ల కాలంలో సింగరేణి సంస్థలో జరిగిన అన్ని కాంట్రాక్టులు, కీలక అధికారిక నిర్ణయాలపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలి. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న టెండర్ ప్రక్రియలను కూడా ఈ విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఎంపీ డిమాండ్ చేశారు.
సింగరేణి వంటి ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ రంగ సంస్థలో పారదర్శకతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. గత పదేళ్లుగా టెండర్ల కేటాయింపుల్లో ఏవైనా అవకతవకలు జరిగి ఉంటే, వాటిని బయటపెట్టి ప్రజలకు నిజానిజాలు తెలియజేయాలని ఎంపీ చామల (MP Chamala) కోరారు.


