కలం, వెబ్ డెస్క్: బంగారం, వెండి ధరలు(Gold Silver Prices) ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరి ఊహలకు అందడం లేదు. ఒక రోజు భారీగా పెరుగుతూ మరుసటి అదే రీతిలో భారీగా తగ్గుతూ అందరికీ షాకిస్తున్నాయి. తాజాగా శనివారం బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో తగ్గాయి. తులం బంగారం ధర ఒక్కరోజే రూ.8 వేలకు పైగా పడిపోయింది. హైదరాబాద్ లో శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర(Gold Prices) రూ.1,69,200 ఉండగా శనివారం రూ.8,620 తగ్గి ప్రస్తుతం రూ.1,60,580గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం రూ.1,55,100 ఉండగా శనివారం రూ.7,900 తగ్గి రూ.1,47,200గా ఉంది. గ్లోబల్ మార్కెట్‌లలో వస్తున్న మార్పులతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు వెండి ధరలు(Silver Prices) ఊహించని స్థాయిలో పడిపోయాయి. ఒక్క రోజులోనే వెండి ధర ఏకంగా రూ.50 వేలకు పైగా తగ్గింది. ఇటీవలి కాలంలో రోజూ వెండి ధర పెరుగుతూనే ఉంది. కానీ, ఒక్కరోజులోనే ఇంత భారీ మొత్తం తగ్గడం విశేషం. శుక్రవారం సాయంత్రానికి రూ.4,05,000గా ఉన్న వెండి ధర శనివారం ఉదయం రూ.55,000 తగ్గి రూ.3,50,000 వద్ద కొనసాగుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గిపోయాయి.


