కలం, వెబ్ డెస్క్ : ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ) అధినేత, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. ఆయన మరణంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ క్రమంలో తరువాతి డిప్యూటీ సీఎంగా అజిత్ భార్య సునేత్ర పవార్ (Sunetra Pawar) నియామకం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. భర్త స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు, పార్టీని నడపడానికి ఆమె సిద్ధమయ్యారు. ఆమె బాధ్యతలు స్వీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే మరాఠి గడ్డపై తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర (Sunetra Pawar) నిలవనున్నారు.
మరోవైపు డిప్యూటీ సీఎం ఎంపికపై ఎన్సీపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. అజిత్ పవార్ కుటుంబం, ఎన్సీపీకి ప్రభుత్వం పరంగానే కాకుండా బీజేపీ తరఫునా పూర్తి స్థాయిలో అండగా ఉంటామని వెల్లడించారు.
ఎన్సీపీ విలీనాన్ని అజిత్ కోరుకున్నారు : శరద్ పవార్
ఉపముఖ్యమంత్రిగా అజిత్ భార్య సునేత్ర పవార్ నియామకం అవుతారని వస్తున్న వార్తల వేళ అజిత్ బాబాయ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) నాయకుడు శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సునేత్ర అజిత్ వారసురాలిగా బాధ్యతలు చేపట్టనున్న విషయం తనకు తెలియదన్నారు. 2023లో అజిత్ పవార్ తో ఎన్సీపీలోని ఇరువర్గాల కలయిక కోసం చర్చించానని చెప్పారు. దీనికి అజిత్ సానుకూలంగా స్పందించినట్లు శరాద్ పవార్ చెప్పారు.


