కలం, వెబ్డెస్క్: ప్రతిభకు, కళకు వయసుతో పనిలేదు. ఇదే విషయాన్ని మళ్లీ రుజువు చేశారు భిక్ల్యా దిండా(92), సిమాంచల్ పాత్రో(99). చిన్నప్పటి నుంచి తమను తాము అంకితం చేసుకున్న కళ తొంభైయ్యేళ్ల వయసులో ఈ కళాకారులకు పద్మాలు తెచ్చిపెట్టింది. ఆదివారం భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో భిక్ల్యా దిండా, సిమాంచల్ పాత్రో పద్మశ్రీ (Padma Shri) పురస్కారాలకు ఎంపికయ్యారు. తద్వారా అత్యంత పెద్ద వయస్సుల్లో ఈ పురస్కారాలు అందుకున్న కళాకారులుగా గుర్తింపు పొందారు.
80 ఏళ్లుగా తర్పా మ్యూజిక్..
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా జవహర్ తాలూకాలోని మారుమూల గిరిజన గ్రామమైన వల్వాండాకు చెందిన భిక్ల్యా దిండా తర్పా సంగీతంలో సుప్రసిద్ధులు. వారసత్వంగా 12 ఏళ్ల వయసులోనే ఈ కళను ఆయన ఒంట పట్టించుకున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో, స్థానికంగా దొరికే చెట్ల నుంచి తయారుచేసిన బూరలాంటి తర్పా పరకరాన్ని లయబద్దంగా, శ్రావ్యంగా వినిపించడంలో భిక్ల్యా సిద్ధహస్తులు. తర్పా వాయిద్యంతో సంగీతం వినిపించడమే కాదు అందుకు అనుగుణంగా నృత్యం చేస్తారీయన. ఇప్పటివరకు దేశవిదేశాల్లో వందలాది పదర్శనలు ఇచ్చారు. ప్రస్తుతం 92 ఏళ్ల వయసులోనూ తర్ఫా సంగీతాన్ని అంతే మధురంగా వినిపిస్తున్నారు. ఎన్నో పురస్కారాలు సైతం అందుకున్నారు. 150 ఏళ్లుగా తమ కుటుంబం తర్పా సంగీతం వినిపిస్తోందని చెప్పే భిక్ల్యా.. ఈ కళ అంతరించి పోకుండా యువతరం అందిపుచ్చుకోవాలని కోరుతున్నారు.
కళ కోసం ఆస్తి అమ్మి..
ఒడిశాలోని బమకేయీ గ్రామంలో 1972లో జన్మించారు సిమాంచల్ పాత్రో (Simanchal Patro). పన్నెండేళ్ల వయసులోనే ‘ప్రహ్లాద నాటకం’తో వేదికపై తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఒడిశా సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఈ జానపద కళా నాటక రూపం పరిరక్షణకు తన వంతు కృషి చేశారు. విస్తృత ప్రచారం కల్పించారు. తన జీవితాన్ని ఒడియా నాటక రంగానికి అంకితం చేశారు. ‘ప్రహ్లాద నాటకం’ కోసం తన ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మి.. ఈ కళ పట్ల తన నిబద్ధత, అంకిత భావాన్ని చాటారు. ఒడియా నాటక రంగం పరిరక్షణకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఈ నిస్వార్థ సేవకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ (Padma Shri) ప్రకటించింది.
Read Also: అవార్డుల్లో ఆ రాష్ట్రాలకు ప్రయారిటీ.. ఆంతర్యమేంటి?
Follow Us On : WhatsApp


