కలం, వెబ్ డెస్క్ : ఎల్పీజీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) హెచ్చరించారు. అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై వినియోగదారులు గందరగోళం చెందుతున్న నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ శుక్రవారం అంబేద్కర్ సచివాలయంలో మంత్రులు తుమ్మల, సీఎస్ రామకృష్ణారావు, పౌర సరఫరాల కమిషనర్ రవీంద్రలతో కలిసి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్యాస్ సరఫరాపై (Gas Supply) గందరగోళం సృష్టించేలా జరుగుతున్న ప్రచారంపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.గ్యాస్ సరఫరా విషయంలో ఎటువంటి గందరగోళానికి గురి కావొద్దని,గృహ వినియోగదారులకు సరిపడా సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులకు,విద్యాసంస్థలకు, వృద్ధాశ్రమాలకు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో 810 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటరీల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుందని, కోటి 29 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా రోజు వారిగా 2.5 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతుందని వివరించారు. అక్రమంగా గ్యాస్ నిలువ చేయడం, అక్రమంగా మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడినందుకు గాను ఇప్పటి వరకు 288 కేసులు నమోదు చేసినట్లు మంత్రి వెల్లడించారు. గ్యాస్ సరఫరాపై రాష్ట్ర వ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాల కలెక్టర్ల అధ్యక్షతన ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు,సరఫరా పరిస్థితిని సమీక్షించాలని మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) ఆదేశించారు.
Read Also: ఇఫ్తార్ ఫర్ ఆల్.. అందరి ఆకలి తీర్చే ఆలోచన మొదలైందిలా..!
Follow Us On: Instagram

