కలం, సెంట్రల్ డెస్క్ : ఇరాన్ (Iran) కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) వైమానిక దాడిలో తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని బ్రిటిష్ వార్తా సంస్థ ‘ది సన్’ కథనం ప్రచురించింది. ఈ దాడిలో ఆయన ఓ కాలు కూడా కోల్పోయినట్లు సమాచారం. ఫిబ్రవరి 28న మొజ్తాబా తండ్రి అయతొల్లా అలీ ఖమేనీపై జరిపిన దాడిలోనే 56 ఏండ్ల మొజ్తాబా కూడా గాయపడినట్లు తెలుస్తున్నది. టెహ్రాన్‌లోని సినా యూనివర్సిటీ హాస్పిటల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య చికిత్స పొందుతున్నారని సమాచారం.
ఆయన కాలేయం, కడుపు భాగం కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది. ఇరాన్ ఆరోగ్య శాఖ మంత్రి, ప్రముఖ ట్రామా సర్జన్ మొహమ్మద్ రెజా జాఫర్‌ఘండి నేతృత్వంలోని వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నాయి. ఇరాన్ అధ్యక్షుడి కొడుకు యూసుఫ్ పెజెష్కియన్ స్పందిస్తూ.. మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) క్షేమంగా ఉన్నారని టెలిగ్రామ్ ద్వారా ప్రకటించారు. మొజ్తాబా సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఒక్కసారి కూడా కెమెరా ముందుకు రాలేదు.
తాజాగా ఆయన పేరిట విడుదలైన ప్రకటనను కూడా టీవీలో న్యూస్ యాంకర్లే చదివి వినిపించారు. ఇది ఆయన ఆరోగ్యంపై అనుమానాలను మరింత పెంచుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ‘మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇరాన్ తన సైనిక కార్యకలాపాలను మొజ్తాబా ప్రమేయం లేకుండానే కొనసాగిస్తున్నదని, వ్యవస్థ నడిచేలా గతంలోనే ఏర్పాట్లు జరిగాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
Read Also: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న అనుష్క.. వరుడు ఎవరంటే!
Follow Us On: Instagram

