కలం వెబ్ డెస్క్ : నిర్మల్ జిల్లాలోని భైంసా(Bhainsa)లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. భైంసా ఆర్టీసీ బస్సు డిపో సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ కంటైనర్ వ్యాన్, కారు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో కారు నుజ్జునుజ్జయ్యింది. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తులను భోజారం పటేల్, పొలిమేర రాజన్న, గంగాధర్, బోయిడి బాబన్నగా గుర్తించారు. మృతులంతా నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని కుప్తి గ్రామానికి చెందిన వారు. వీరు హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


