కలం, నిజామాబాద్ బ్యూరో : మరో మూడు రోజుల్లో మున్సిపల్ షెడ్యూల్ విడుదల అవుతుందని మున్సిపల్ ఎన్నికలను (Muncipal Elections) ఆషామాషీగా తీసుకోవద్దని మంత్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar) నిజామాబాద్ లో వ్యాఖ్యానించారు. నిజామాబాద్ లోకసభ నియోజకవర్గ పరిధిలోని నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్ భీంగల్, మెట్ పల్లి, కోరుట్ల మున్సిపాలిటీల పార్టీ సమన్వయ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని చెప్పారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో నెక్స్ట్ లెవెల్ అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పుకొచ్చారు.
సివిల్ సప్లయ్ మంత్రిగా అత్యంత సంతృప్తిని ఇచ్చిన పథకం పేదలకు సన్నబియ్యం పంపిణీ అని అన్నారు. బిఆర్ఎస్ పదేళ్ల కాలంలో అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వలేక పోయారని విమర్శించారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. రానున్న పురపాలక సంఘం ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ప్రతీ పురపాలక సంఘం మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
పార్టీ నిర్వహిస్తున్న సర్వేల ఆధారంగా టికెట్లు ఖరారు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar) ప్రకటించారు. సర్వేతో పాటు విధేయత, చిత్తశుద్ధి, క్రమశిక్షణ ల ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 85శాతం ప్రజలకు 13,600 కోట్ల వ్యయంతో ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు. పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనలో అర్హులైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయక పోగా ఉన్న కార్డులలో కొత్త సభ్యుల చేర్పులకు కుడా అవకాశం ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు.
ఇటువంటి అంశాలతో ప్రజల దగ్గరకు పోతే అంతిమ విజయం కాంగ్రెస్ పార్టీదే నన్న వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్మరించరాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హితవుపలికారు. ఈ కార్యక్రమంలో టీపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు యం.డి షబ్బీర్ అలీ, నిజమాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, శాసనమండలి సభ్యులు బల్మూరి వెంకట్, కార్పొరేషన్ చైర్మన్ అనిల్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేశ్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Read Also: మేడారంలో ఇప్పపువ్వు లడ్డూకు ఫుల్ డిమాండ్
Follow Us On: X(Twitter)


