కలం, తెలంగాణ బ్యూరో : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొనే వీవీఐపీ పొలిటీషియన్లకు కొత్త చిక్కులొచ్చిపడ్డాయి. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లను ఇష్టారీతిలో వాడుకోవడంపై ఆంక్షలు వచ్చాయి. ఆటు సేఫ్టీ, ఇటు సెక్యూరిటీ కోణాల నుంచి ఆలోచించి పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (DGCA New Rules) కఠిన నిబంధనలను రూపొందించారు. ఇకపైన విమాన ప్రయాణానికి సంబంధించి పూర్తి నిర్ణయాధికారాన్ని పైలట్‌లకే కట్టబెట్టింది. దీంతో అర్జెంట్.. తప్పనిసరిగా వెళ్ళాల్సిందే.. అంటూ పొలిటీషియన్లు ఒత్తిడి చేసే అవకాశం లేదు. టెక్నికల్‌గా, మెకానికల్‌గా విమానం/హెలికాప్టర్ ఫిట్‌గా ఉందనుకున్నప్పుడే పైలట్ నిర్ణయం తీసుకుంటారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, చీకటి పడినా నిర్మొహమాటంగా పైలట్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ కానున్నది. అజిత్ పవార్ ఫ్లైట్ యాక్సిడెంట్ తర్వాత డీజీసీఏ ఈ డైరెక్టన్‌లో ఆలోచించి కఠిన నిబంధనలతో సర్క్యులర్ జారీచేసింది.
ఫ్లైట్ జర్నలీలో పైలట్ నిర్ణయమే ఫైనల్
వీవీఐపీలు చేసే విమాన ప్రయాణాల్లో పైలట్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ కానున్నది. అజిత్ పవార్ (Ajit Pawar) ఫ్లైట్ యాక్సిడెంట్‌ను గమనంలోకి తీసుకుని విమాన ప్రయాణాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేలా ఈ సర్క్యులర్‌ను డీజీసీఏ రూపొందించింది. తక్షణం ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ఎన్నికల ప్రచారంలో వినియోగించే తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉండే చార్టర్డ్ ఫ్లైట్స్, హెలికాప్టర్లలో నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నట్లు గుర్తించడంతో ఈ సర్క్యులర్ జారీ చేయాల్సి వచ్చిందని డీజీసీఏ పేర్కొన్నది. ఎలాంటి ఒత్తిళ్ళకు లొంగకుండా సేఫ్ జర్నీ కోసం ఫైనల్ నిర్ణయం తీసుకునే బాధ్యత పైలట్‌దేనని నొక్కిచెప్పింది. పైలట్‌లకు స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లోగానీ, భద్రత లేదనుకున్న సమయాల్లోగానీ విమానాన్ని నడపడం వీలుపడదంటూ నిరాకరించే అధికారం ఇకపైన పైలట్లదే.
ఆ సర్క్యులర్‌లో పేర్కొన్న నిబంధనలివే
• ప్రతీ చార్టర్డ్ ఫ్లైట్‌కు (Charter Flight) రెండు ఇంజన్లు ఉండాలి.
• ప్రతీ ప్రయాణానికి అనుభవం కలిగిన ఇద్దరు సిబ్బంది (పైలట్, కో-పైలట్) ఉండాలి.
• స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సెక్యూరిటీలో ఉన్నవారు, జెడ్ ప్లస్ కేటగిరీ పరిధిలోని వీవీఐపీలందరికీ (కేవలం ఎలక్షన్ క్యాంపెయినింగ్‌కు మాత్రమే పరిమితం చేయకుండా) ఈ సర్క్యులర్ వర్తిస్తుంది.
• లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, క్యాబినెట్ ర్యాంక్ ఉన్న రాష్ట్ర మంత్రులు, గవర్నర్లు, ప్రధాన న్యాయమూర్తులు.. వీరందరికీ ఇది వర్తిస్తుంది.
• ప్రయాణానికి సంబంధించి పైలట్లపై వీరు ఎలాంటి ఒత్తిడి చేయకూడదు. ఇలాంటి ఒత్తిళ్లకు పైలట్లు తలొగ్గకూడదు. సేఫ్ జర్నీ విషయంలో పైలట్‌లు, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ల నిర్ణయమే ఫైనల్.
• విమాన ప్రయాణ సమయాల్లో లేదా చివరి నిమిషంలో రూట్ షెడ్యూలును మార్చే విషయంలో పైలట్‌లతో వీవీఐపీలు నేరుగా డిస్కస్ చేయకూడదు. సంబంధిత విమానయాన సంస్థ మేనేజ్‌మెంట్‌తో సమన్వయం చేసుకోవాలి.
• మారుమూల ప్రాంతాల్లో విమానం/హెలికాప్టర్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు కనీసం 24 గంటల ముందే హెలిప్యాడ్ లేదా ఎయిర్‌స్ట్రిప్ భద్రతపై నిర్ధారణకు రావాలి. సంబంధిత జిల్లా అధికార యంత్రాంగం నుంచి ముందస్తు ఎన్ఓసీ తప్పనిసరిగా పొందాలి.
• వాతావరణాన్ని గుర్తించేందుకు విమానంలో ఉండే ‘వెదర్ రాడార్’ సహా కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ కచ్చితంగా పనిచేస్తూ ఉండాలి.
• ప్రతీ ప్రయాణానికి ముందు విమానాన్ని క్షుణ్ణంగా ఇన్‌స్పెక్షన్ చేసి సర్టిఫై చేసే మెకానిజం పటిష్టంగా అమలు కావాలి. ఏ చిన్న లోపం కనిపించినా అది రెక్టిఫై అయ్యేంతవరకు విమానం టేకాఫ్ కాకూడదు.
• విమానంలోకి ఎక్కించే ప్రతీ బ్యాగేజ్‌ను తప్పనిసరిగా క్షుణ్ణంగా తనిఖీ చేయాలి.
• నిబంధనలను ఉల్లంఘిస్తే సదరు విమానయాన సంస్థ యాజమాన్యంపై కఠిన చర్యలు ఉంటాయి.

