కలం, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ (PM Modi) హైదరాబాద్ వేదికగా చేసిన ప్రసంగం మొత్తం దేశాన్నే కుదిపేస్తున్నది. పొదుపు చర్యలు తప్పవంటూ చేసిన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో ముప్పు తప్పదనే సంకేతాన్ని ఇచ్చినట్లయింది. విదేశీ పర్యటనలు, ఖరీదైన వెడ్డింగ్స్, విచ్చలవిడి ఖర్చును తగ్గించుకోవడం, దుబారాను అరికట్టడం.. వీటితో మొదలుపెట్టి ‘స్వదేశీ’ అంటూ పిలుపు ఇవ్వడం మున్ముందు ఇబ్బందులుంటాయంటూ సున్నితంగా హెచ్చరించడం ప్రజల్లో సరికొత్త ఆందోళనకు కారణమవుతున్నది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తికాగానే వడ్డింపులు ఉంటాయన్న అనుమానాలకు ప్రధాని మాటలు బలం చేకూర్చినట్లయింది. ఒకేసారి రేట్లను పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో సంకేతాల రూపంలో ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం :
పశ్చిమాసియాలోని సంక్షోభం ముడిచమురు ధరలు పెరగడానికి కారణమైంది. భారత్‌కు దిగుమతులపైనా ప్రభావం పడింది. ఇప్పటికీ ఎల్పీజీ సంక్షోభం కొనసాగుతూనే ఉన్నది. పూర్తిస్థాయిలో గాడిన పడలేదు. మరోవైపు యూరియాపైనా ఆ ఎఫెక్ట్ కనిపిస్తున్నది. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పు లేదు. ఇండస్ట్రియల్ డీజిల్, కమర్షియల్ ఎల్పీజీ ధరలను మాత్రం ఆయిల్ కంపెనీలు బాగానే పెంచాయి. రానున్న రోజుల్లో వడ్డింపులు డొమెస్టిక్ ఎల్పీజీ సహా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగవచ్చనే సంకతాలు ప్రధాని స్పీచ్ ద్వారా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆయిల్ కంపెనీలు లక్ష కోట్ల నష్టం అంటూ మొత్తుకుంటున్నాయి. దీంతో ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు సామాన్యులపై భారాన్ని మోపడానికి సిద్ధమవుతున్నాయి.
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, కార్‌పూలింగ్ పిలుపు వెనక మర్మం :
పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని క్రమంగా తగ్గించుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలవైపు మళ్లాలంటూ ప్రధాని పిలుపునిచ్చారు. ఇందుకోసం వీలైనంతగా మెట్రో రైల్ లాంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వాడుకోవాలన్నారు. కార్ పూలింగ్ విధానాన్ని అవలంబించాలన్నారు. వీలైతే రోజువారీ ప్రయాణాలు తగ్గించుకునేందుకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానాన్ని ఎంచుకోవాలన్నారు. ఇన్ని జాగ్రత్తలు చెప్తున్న మోడీ క్రమంగా ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రధాని సూచించిన జాగ్రత్తలన్నీ కేవలం సామాన్యులకేనా?.. లేక రాజకీయ నాయకులకూ వర్తిస్తుందా?.. అనే వాదనలూ తెరపైకి వస్తున్నాయి. భారీ కాన్వాయ్‌లు, అధికారిక కార్యక్రమాలు, పార్టీల ర్యాలీలు, విజయోత్సవాలు.. వీటిని పార్టీల నేతలు తగ్గించుకోరా అనే చర్చ కూడా మొదలైంది.
బంగారం కొనుగోళ్ళపైనా ప్రధాని జాగ్రత్తలు :
విదేశీమారక ద్రవ్య నిల్వల అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోడీ.. ఏడాది పాటు బంగారం కొనుగోళ్ళను బంద్ పెట్టుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విదేశాల్లో జరుపుకునే వెడ్డింగ్‌లను ఆపుకోవాలన్నారు. విదేశీ పర్యటనలను కూడా తగ్గించుకోవాలన్నారు. బంగారాన్ని కొనడం బంద్ పెడితే విదేశీ కరెన్సీ నిల్వలు పెరుగుతాయంటున్నారు. ఇన్ని జాగ్రత్తలు చెప్తున్న మోడీ రాజకీయ పార్టీల నేతలు, వ్యాపారవేత్తలు, సెలెబ్రిటీల వివాహాలు, కుటుంబ ఫంక్షన్ల గురించి, వాటికి చేసే భారీ ఖర్చు గురించి ఎందుకు మాట్లాడడంలేదన్న విమర్శలూ వస్తున్నాయి. కిలోలకొద్దీ బంగారం నగలను ధరించి సంపదను ప్రదర్శించే సంపన్నులకూ ప్రధాని ఈ విధానాన్ని వర్తింపజేస్తారా అనే మాటలూ వినిపిస్తున్నాయి. బంగారాన్ని ఒక పెట్టుబడిగా భావించే మిడిల్ క్లాస్ జనం ఇప్పుడు ప్రధాని మాటలతో కన్‌ప్యూజన్‌లో పడ్డారు.
మాటల్లో ‘స్వదేశీ’.. చేతల్లో విదేశీ :
వంట నూనెల మొదలు అనేక నిత్యావసర వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నదని చెప్పిన ప్రధాని ఇకపైన ‘స్వదేశీ’ విధానానికి అలవాటు పడాలని ప్రజలను అప్రమత్తం చేశారు. రాజకీయ నాయకులు రిస్ట్ వాచీలు మొదలు లగ్జరీ కార్ల వరకు త్యాగం చేస్తారా?.. ప్రధాని మాటలు ప్రజలకు మాత్రమేనా?.. వారికి వర్తించవా?.. మొబైల్ ఫోన్ మొదలు ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ వరకు స్వదేశీ ఉత్పత్తులు లేకపోవడంతో విదేశాల నుంచే దిగుమతి చేసుకోవడం అనివార్యమవుతున్నది. ప్రజలకు ఉపదేశాలు చేస్తున్న ప్రధాని మోడీ వారి పార్టీ నేతల విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తారా?.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అమలు చేస్తారా?.. అంటూ జనం నుంచి ప్రశ్నల వర్షం కురుస్తున్నది.
ముందున్నది మొసళ్ళ పండగ.. :
రాబోయే రోజుల్లో ఆర్థిక తిప్పలు తప్పవని, అన్ని వస్తువుల ధరలూ పెరుగుతాయని ప్రధాని మాటల ద్వారా అర్థమవుతున్నది. ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకుండా రాజకీయ ప్రయోజనాన్ని నెరవేర్చుకున్న ప్రధాని.. ఇకపైనా ధరలు పెంచి ఎడాపెడా భారం మోపేందుకు సిద్ధమవుతున్నారనేది ఆయన మాటల ద్వారా వెల్లడైనట్లయింది. ప్రధాని మాటలతోనే కాక ఆయిల్ కంపెనీలు వల్లెవేస్తున్న లక్ష కోట్ల నష్టం అనే ప్రకటనలకు కొనసాగింపుగానే ప్రధాని మాటలున్నాయనే సాధారణ అభిప్రాయం వ్యక్తమవుతున్నది. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే సంకేతాన్ని ఇచ్చినట్లయింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఊహకు అందని తీరులో పెరిగే ప్రమాదమున్నది. కరోనా తర్వాత కొత్త తరహా సంక్షోభాన్ని ప్రజలు ఎదుర్కోనున్నారనే సంకేతాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.

