తెలంగాణ క్యాబినెట్ విస్తరణ : ఈసారి రెడ్లకు నో ఛాన్స్!!

కలం, తెలంగాణ బ్యూరో : Telangana Cabinet Expansion | రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులు బీసీ, ఎస్టీకి దక్కే అవకాశాలున్నాయి. ఇంకో రెడ్డి సామాజికవర్గానికి ఇవ్వొద్దని ఏటు ఏఐసీసీ, ఇటు ముఖ్యమంత్రి ఏకాభిప్రాయంతో ఉన్నట్లు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల సమాచారం. ప్రస్తుత మంత్రివర్గంలో ఇద్దరు లేదా ముగ్గురిని తొలగించి వారి స్థానంలో కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వొచ్చనే ఊహాగానాలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. వీరి స్థానంలో ఎవరికి ఛాన్స్ ఉంటుందనేది త్వరలో తేలనున్నది. కానీ ఖాళీగా ఉన్న రెండింటికి మాత్రం ఒక బీసీ, ఒక ఎస్టీ (లంబాడా)కి ఇవ్వాలని దాదాపుగా ఖరారైనట్లు తెలిసింది. జిల్లాల సమీకరణాన్ని పరిగణనలోకి తీసుకుని ఆశావహుల్లో ఎవరికి ఇవ్వాలన్నది ఫైనల్ కానున్నది. ఎలాగూ సెకండ్ వీక్ తర్వాతనే మంత్రివర్గంలో మార్పులు ఉంటాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ లోపే ఒకసారి సీఎం, పీసీసీ చీఫ్ ఢిల్లీ పర్యటన ఉండే అవకాశముంది.

గతంలోనే సీఎం, ఏఐసీసీ నేతల మధ్య చర్చ :

ఖాళీగా ఉన్న రెండు బెర్తుల్లో ఒకదాన్ని తప్పకుండా లంబాడా కమ్యూనిటీకి ఇవ్వాలనే సూత్రప్రాయ నిర్ణయం జరిగిందని పార్టీ వర్గాల సమాచారం. బాలు నాయక్, రామచంద్రునాయక్‌లలో ఒకరికి అవకాశం దక్కనున్నది. రామచంద్రు నాయక్‌ పేరును డిప్యూటీ స్పీకర్‌గా ఇప్పటికే సీఎం ప్రకటించారు. కానీ ఆయన ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుని బాలూ నాయక్‌ను డిప్యూటీ స్పీకర్ చేయడంపైనా పార్టీలో చర్చ జరుగుతున్నది. కానీ రామచంద్రు నాయక్ పేరును ప్రకటించిన తర్వాత ఆ బాధ్యతలు చేపట్టడానికి బాలునాయక్ సుముఖంగా లేరనే వార్తలూ పార్టీ వర్గాల నుంచే వినిపించాయి. మంత్రి పదవిని ఆశించారని, అది దక్కకపోతే సైలెంట్‌గా ఉండడానికి కూడా సిద్ధపడ్డారని, కానీ ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ పోస్టుకు పేరును ప్రకటించిన తర్వాత ఆ స్థానంలోకి వెళ్ళడానికి మాత్రం ఆసక్తిగా లేరని తెలిసింది.

బీసీల్లో ఒకరికి మంత్రి పదవి ఖాయం? :

రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం నలుగురు రెడ్డి, నలుగురు ఎస్సీ, ముగ్గురు బీసీ, ముగ్గురు అగ్రవర్ణాలు, ఒక మైనారిటీ ఒక ఎస్టీకి చెందినవారు ఉన్నారు. దీంతో ఒక బీసీ, ఒక లంబాడా ఇస్తే సోషల్ జస్టిస్ ఈక్వేషన్ సెట్ అవుతుందన్నది ఏఐసీసీ భావన. రాష్ట్రంలో బీసీ జనాభా 56% ఉన్నందున ఆ కమ్యూనిటీకి ఇవ్వడమే సహేతుకం అనేది పార్టీ ఆలోచన. బీసీల్లో ముదిరాజ్, గౌడ్, పద్మశాలికి అవకాశం దక్కినందున మరో బీసీ మంత్రిని ఏ సామాజికవర్గం నుంచి ఎంపిక చేయాలన్నది కీలకం. మున్నూరు కాపు సామాజికవర్గానికి ఇటీవలే మంత్రి హోదాతో కూడిన సలహాదారు పోస్టు ఇవ్వడంతో మంత్రి పదవికి కూడా అదే సామాజికవర్గానికి అవకాశం దక్కుతుందా అనేది ఆసక్తకరంగా మారింది. ఢిల్లీ టూర్ తర్వాత దీనిపై కొంత క్లారిటీ రానున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>