కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియా యుద్ధ భయం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (Modi) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం లాక్‌డౌన్ (Lockdown) పెట్టబోతున్నదన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల ముఖ్యమంత్రులతో శుక్రవారం మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల సీఎంలు మినహా మిగిలిన రాష్ట్రాల సీఎంలంతా ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, ఎల్‌పీజీ (LPG) కొరత లేదని క్లారిటీ ఇచ్చారు. కృత్రిమ కొరత సృష్టించడం, బ్లాక్ మార్కెట్ చేస్తుండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని నియంత్రించాలని ఇందుకు రాష్ట్రాలు చొరవ తీసుకోవాలని కోరారు.
యుద్ధ ప్రభావంపై చర్చ
పశ్చిమాసియా పరిస్థితుల ప్రభావంపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ (Modi) చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవచ్చని సూచించారు. యుద్ధం ముగిసినా అక్కడి మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, దీని ప్రభావం అంతర్జాతీయంగా కనిపిస్తున్నదని ప్రధాని పేర్కొన్నారు. దిగుమతులు, ఎగుమతులు, ఇంధన సరఫరాలపై ప్రభావం పడటంతో దేశీయ ఆర్థిక వ్యవస్థపై కూడా ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలిపారు.
క్యూలైన్లు ఉండటం ఆందోళనకరం
దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీకి ఎటువంటి కొరత లేకపోయినప్పటికీ క్యూ లైన్లు ఎందుకు ఉంటున్నాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు కారణమని ఈ సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డారు. ఇంధన ధరల విషయంలో ప్రజలపై భారం తగ్గించేందుకు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినట్లు కేంద్రం వెల్లడించింది. అయినప్పటికీ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో హోటల్ రంగం సహా పలు రంగాలపై ప్రభావం పడుతున్నట్లు మోదీ అభిప్రాయపడ్డారు.
సమీక్ష అనంతరం మోదీ ప్రసంగం
గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను మోదీ వివరించారు. సరఫరాల నిర్వహణ, ధరల నియంత్రణ, ప్రజలకు అవసరమైన వస్తువుల లభ్యతపై ప్రధానంగా చర్చ జరిగింది. సమీక్ష అనంతరం ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో దేశానికి అవసరమైన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. సమావేశంలో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ , తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక అధికారులు పాల్గొన్నారు.
Read Also: స్టార్ క్యాంపెయినర్లకు కఠిన నిబంధనలు.. పైలట్‌లకే ఫుల్ పవర్స్
Follow Us On: Instagram

