కలం, తెలంగాణ బ్యూరో : పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉండే సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) ఇటీవల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఆయన ఆధ్యాత్మిక కోణం గురించే బీఆర్ఎస్ వర్గాల్లో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. నెల రోజులుగా ఆయన పాల్గొంటున్న కార్యక్రమాలను ఏకరువు పెట్టుకుంటున్నారు. స్పిరిచ్యువల్ యాక్టివిటీస్‌లో (Spiritual Activities) పాల్గొంటున్న హరీశ్.. వాటితో మానసిక శాంతి పొందుతున్నారా?.. లేక తప్పనిసరి పరిస్థితుల్లో పాల్గొంటున్నారా?.. లేక ఆయన ఆలోచనలు వేరే డైరెక్షన్‌లోకి వెళ్తున్నాయా?.. ఇవి సమాధానంలేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో గత నెలలో జరిగిన వీర హనుమాన్ విజయ యాత్ర మొదలు తాజాగా నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం అశోక్‌నగర్‌లో కాకతీయుల కాలం నాటి శివాలయం సందర్శన వరకు.. హరీశ్ కదలికలు సరికొత్త చర్చకు దారితీశాయి.
‘రామ్ లక్ష్మణ్ జానకీ..’
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి ఏప్రిల్‌లో హనుమాన్ శోభాయాత్రకు హరీశ్‌రావు హాజరయ్యారు. ‘రామ్ లక్ష్మణ్ జానకీ.. జై బోలో హనుమాన్ కీ..’ అంటూ నినదించిన హరీశ్‌రావు తాజాగా విజయవాడలో జరిగిన హనుమాన్ దీక్షా పీఠంలో ఆంజనేయస్వామి ఆలయ పునఃప్రతిష్టలో ‘జై బోలో హనుమాన్‌కీ’ అని నినదించారు. చినజీయర్ చేతుల మీదుగా జరిగిన ఆలయ జీర్ణోద్ధారణ పనులు, ఆలయం పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు ఆయన. తర్వాత.. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని కాకతీయుల కాలం నాటి శివాలయం ధ్వంసమైతే దాన్ని చూడడానికి కూడా హరీశ్ వెళ్లారు. ఇలా వరుసగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన యాక్టివ్‌గా పాల్గొనడం రాజకీయంగానూ చర్చకు దారితీసింది. రాజకీయాల నుంచి ఆధ్యాత్మికం వైపు మనశ్శాంతి కోసం అడుగులా?.. లేక భవిష్యత్ పాలిటిక్స్ ప్రయాణానికి సంకేతాలా?.. అనే తీరులోనూ రాజకీయ వర్గాల్లో డిస్కషన్స్ కంటిన్యూ అవతున్నాయి.
సిద్దిపేటలోనూ..!
సిద్దిపేట ఎమ్మెల్యేగా ఏ మతం తరఫున కార్యక్రమాలు జరిగినా హాజరు కావడం అనవాయితీ. గత నెల చివరి వారం నుంచి హిందూ ఆలయాల ఉత్సవాల్లో హరీశ్ రావు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుండటం గమనార్హం. ఒక ప్రజా ప్రతినిధిగా సొంత నియోజకవర్గంలో అలాంటివాటికి హాజరుకాక తప్పదని శ్రేణులు సర్దిచెప్పుకుంటున్నా ‘‘ఏదో తేడా కొడుతోంది..” అనే అనుమానాలూ లేకపోలేదు. ఈ మార్పు దేనికి సంకేతం అనేదే వారిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది.
ఇప్పటికే ‘బీజేపీతో టచ్‌లో’ అపవాదు
బీఆర్ఎస్ పార్టీలో హరీశ్‌రావుకు (Harish Rao) ట్రబుల్ షూటర్ అనే గుర్తింపుతో పాటు కీలకమైన బాధ్యతలను కేసీఆర్ ఆయనకే అప్పజెప్పేవారనే అభిప్రాయమున్నది. అదే సమయంలో ఒక సందర్భంలో బీజేపీ సీనియర్ నేత అమిత్ షాతో హరీశ్ టచ్‌లోకి వెళ్లారనే అపవాదు కూడా ఉన్నది. ఆ కారణంగానే కేసీఆర్ తన రెండో టర్ములో ఏడాది పాటు ఆయనకు మంత్రి పదవి అప్పజెప్పలేదనే వాదన వినిపించింది. కేటీఆర్‌ను పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినప్పుడు, ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని పార్టీలో కొందరి నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు.. హరీశ్ ఒకింత నొచ్చుకున్నారనే మాటలూ వినిపించాయి. పార్టీకి వారసుడు కేటీఆర్ అవుతారని, హరీశ్‌రావుకు ఆ అవకాశం లేదని పార్టీ నేతల మధ్య ఓపెన్‌గానే చర్చలు జరిగాయి. వీటన్నింటితో పార్టీలో ఆయన అప్రాధాన్యం అయిపోయారనే టాక్ కూడా వినిపించింది. గతేడాది కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత హరీశ్‌రావు టార్గెట్‌గా ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వాటికి పార్టీ నేతల నుంచి కౌంటర్ లేకపోవడంతో హరీశ్ మనసు నొచ్చుకున్నారని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు.
బావబామ్మర్దుల ఆధిపత్య పోరు
బీఆర్ఎస్‌లో (BRS) ఏం జరుగుతుందనేది ఆ పార్టీ శ్రేణులకే అంతుచిక్కని అయోమయంగా మారింది. నేతలు తలోదారి అనే వాతావరణం నెలకొన్నది. పార్టీ ఉమ్మడి కార్యక్రమం లేకపోవడంతో నేతలు అనుకున్నదే అమలవుతున్నది. అధినేత కేసీఆర్ (KCR) ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. పార్టీని ఎవరు నడిపించాలో క్లారిటీ లేదు. గత నెల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్, హరీశ్‌రావు (Harish Rao) మధ్య ఆధిపత్య పోరు కొట్టొచ్చినట్లు బయటపడింది. ఒకరు బడ్జెట్‌పై స్పీచ్ ఇస్తే.. మరొకరు డిమాండ్లు-గ్రాంట్‌లపై మాట్లాడేవారు. ఒకరు చిట్‌చాట్ పెడితే.. మరొకరు పోటీగా ప్రెస్‌మీట్ పెట్టేవారు. ఈ ఇద్దరి మధ్య కంటికి కనిపించని తీరులో కోల్డ్ వార్ నడిచింది. ఆ పార్టీ లీడర్లే దీన్ని బావబామ్మర్దుల పోటీ అంటూ కామెంట్ చేసుకునేవారు. పార్టీలో రాజకీయం ఇలా ఉంటే హరీశ్‌రావు ఇటీవల మంత్రుల కుంభోకోణాలు, భూకబ్జాల అంశాన్ని ప్రెస్‌మీట్‌లు పెట్టి ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు.
దీపం ఉండగానే..!
ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో రాజకీయంగా ఏ రోజు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియని అనిశ్చితి.. మరోవైపు పొమ్మనలేక పొగబెట్టే పరిస్థితులు ఎప్పుడైనా తలెత్తే ప్రమాదం ఉందనే అనుమానాలు హరీశ్‌రావు అనుచరులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా బీజేపీ నేతలతో రహస్యంగా కలిశారనే ఆరోపణలు వచ్చాయి. పార్టీ కోసం ఎంత చేసినా చివరకు కేటీఆర్‌కే పగ్గాలు అనేది సుస్పష్టం. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే తరహాలో ఇప్పటి నుంచే ఆల్టర్నేట్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని అనుచరుల నుంచి హరీశ్పై ఒత్తిడి కూడా ఉన్నది. ఇప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా గడపడం వెనక రానున్న రోజుల్లో రాజకీయంగానూ అడుగులు అటువైపు దారితీస్తాయేమో అనే సరికొత్త చర్చకు తగిన వాతావరణం ఏర్పడింది. కేసీఆర్ వెంటే తాను అని చాలాసార్లు హరీశ్‌రావు బహిరంగంగానే క్లారిటీ ఇచ్చారు. అయినా అనుమానాలు, ఆరోపణలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
నెల రోజుల్లో హరీశ్ పాల్గొన్న ఆధ్యాత్మిక కార్యక్రమాలివీ..!
ఏప్రిల్ 2 : ఎల్బీనగర్ వీర హనుమాన్ విజయ యాత్ర
ఏప్రిల్ 26 : సిద్దిపేట జిల్లా దుద్దెడలోని చౌడాలమ్మ ఆలయం తెప్పోత్సవం
మే 2 : సిద్దిపేట జిల్లా రంగధాంపల్లి పంచవటి హనుమాన్ ఆలయంలో అన్నప్రసాద భవనం ప్రారంభోత్సవం
మే 11 : విజయవాడలో హనుమాన్ దీక్షాపీఠంలో ఆంజనేయస్వామి ఆలయ పునఃప్రారంభం
మే 11 : వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలోని అశోక్‌నగర్‌లో ఇటీవల కూల్చివేతకు గురైన పురాతన శివాలయం సందర్శన.
Read Also: తెలంగాణకు పొదుపు సూత్రాలు.. APకి నిధులు : మోదీపై కవిత ఫైర్!
Follow Us On : WhatsApp

