కలం, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేండ్ల టైమ్ ఉంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఇప్పటి నుంచి కార్యాచరణ మొదలుపెట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నది. ప్రజల సమస్యలను అందిపుచ్చుకుని ఆందోళనలు చేపడుతున్నది. పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ఎలాగూ ఫామ్ హౌజ్‌కే పరిమితమయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు (KTR – Harish Rao) (Harish Rao) పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. బావ బామ్మర్దులు పోటాపోటీగా జనంలోకి వెళ్తున్నారు. ఒకవైపు వారి పాపులారిటీని పెంచుకుంటున్నారు. పార్టీ శ్రేణుల బలాన్ని వారివైపు తిప్పుకుంటున్నారు. మరోవైపు పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. రాష్ట్రాన్ని రెండు భాగాలుగా చేసుకుని జిల్లాల్లో చక్కర్లు కొడుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కేటీఆర్ ఫోకస్ పెడితే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో హరీశ్‌రావు పర్యటిస్తున్నారు.
ఉత్తర తెలంగాణ జిల్లాల బాధ్యత కేటీఆర్‌కు :
రైతులు, వడ్ల కొనుగోళ్ళు, మంత్రులపై అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ విధానాల్లో లోపాలు, హామీలు అమలులో వైఫల్యం.. ఇలాంటి అంశాలను కేటీఆర్, హరీశ్‌రావు (KTR – Harish Rao) ఏకరువు పెడుతున్నారు. మే నెల 1వ తేదీ నుంచే ఇద్దరూ జిల్లాలను పంచుకుని కార్యాచరణ మొదలుపెట్టారు. మే డే సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కార్మికులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ ఆ తర్వాత మే 2, 4 తేదీల్లో నగరాన్ని ఆనుకుని ఉన్న రంగారెడ్డి, సంగారెడడి జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. క్రిశాంక్ జైల్లో ఉండడంతో వెళ్ళి పరామర్శించారు. మే 3వ తేదీన ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నేతలతో సమావేశమై పార్టీని బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేశారు. మే నెల 5న నిజామాబాద్ జిల్లాలో పర్యటించి నియోజకవర్గ స్థాయి సమావేశాలను నిర్వహించారు. ఆ మరుసటి రోజున వరంగల్ జిల్లాలో జరిగిన సింహగర్జన రైతు సభలో ప్రసంగించారు. కేసీఆర్ హాజరుకావాల్సి ఉన్న ఈ సభను కేటీఆర్ నిర్వహించారు.
దక్షిణ తెలంగాణ జిల్లాలపై హరీశ్‌రావు ఫోకస్ :
మెదక్, ఖమ్మం జిల్లాలతో పాటు నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలపై దృష్టి పెట్టిన హరీశ్‌రావు మే 1వ తేదీన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేసి ‘హ్యామ్’ రోడ్లలో కుంభకోణం జరిగిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మే 3న ఖమ్మం జిల్లాలో పర్యటించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాను సందర్శించి రైతులతో ముచ్చటించి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. కొనుగోళ్ళు సక్రమంగా జరగడంలేదని, తూకంలో మోసం జరుగుతున్నదని ఆరోపించారు. ఆ మరుసటి రోజున కొత్తగూడెం జిల్లాలో పర్యటించి పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. స్థానిక సమస్యలపై చర్చించారు. మే 5న మహబూబ్‌నగర్ జిల్లాను సందర్శించి పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. మే 6వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతులతో రుణమాఫీ, రైతుభరోసా అంశాలను ప్రస్తావించి ప్రభుత్వ వైఫల్యం అంటూ విమర్శలు చేశారు. మే 7న సూర్యాపేట జిల్లా కోదాడ పర్యటన సందర్భంగా రైతుభరోసా, నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వాన్ని విమర్శించారు.
బావ బామ్మర్దులకు కేసీఆర్ వర్క్ డివిజన్? :
రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విభజించి ఇద్దరు సీనియర్ నేతలు పంచుకోవడం కేటీఆర్, హరీశ్‌రావు చేసుకున్న వర్క్ డివిజనా?.. లేక కేసీఆర్ వీరిద్దరినీ కూర్చోబెట్టి చేసిన పని విభజనా?.. అనే చర్చ పార్టీలో మొదలైంది. నిత్యం ఏదో కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతూ పార్టీ హడావిడి ఉండేలా చూసుకుంటున్నారు. ప్రభుత్వంపై ముప్పేట దాడి చేయాలని బీఆర్ఎస్ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. జగిత్యాల సభ సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగంలో.. సగం పీరియడ్ అయిపోయింది.. ఇక ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తాం.. ప్రజలతో కలిసి ఆందోళన చేపడతాం.. అంటూ ప్రస్తావించారు. రెండున్నరేండ్ల తర్వాత జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇప్పటి నుంచే ప్రజల మధ్య తిరుగుతూ నెరేటివ్ క్రియేట్ చేస్తున్నదనే మాటలు ఆ పార్టీ నేతల ద్వారా వినిపిస్తున్నాయి.
Read Also: ముంచుకొస్తున్న ముప్పు.. ప్రధాని అప్పీల్ మర్మమేంటి?
Follow Us On: Instagram

