కలం, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టులో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, అవినీతి, నిబంధనల ఉల్లంఘనపై సీబీఐ దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మొదలైంది. క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సీబీఐ డైరెక్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దర్యాప్తు మొదలుపెట్టాల్సిందిగా ఆ లేఖలో కోరింది. డైరెక్టర్‌ను కూడా ఢిల్లీకి వెళ్ళి కలుస్తామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక, ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు, మూడు బ్యారేజీల లోపాలపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు.. ఇవన్నీ సీబీఐకి చేరాయి. కొన్ని సందేహాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు వివరణ కూడా ఇచ్చారు. తదుపరి ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి సీబీఐ డైరెక్టర్‌తో భేటీ కావచ్చని సచివాలయ వర్గాల సమాచారం. వీలైనంత తొందరగా దర్యాప్తు ప్రారంభం కావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా అన్ని ఏర్పాట్లు సిద్ధమైన తర్వాతనే ప్రారంభించాలని సీబీఐ భావిస్తున్నది.
బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ :
గత ప్రభుత్వంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే 48 గంటల్లో నిర్ణయం తీసుకుని దర్యాప్తు జరిపిస్తామంటూ గతంలో కిషన్ రెడ్డి చేసిన కామెంట్లను కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తున్నారు. గతేడాది సెప్టెంబరు ఫస్ట్ వీక్‌లో రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే తొమ్మిది నెలలు అవుతున్న ఇప్పటికీ అతీగతీ లేదని ఆరోపించారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు సైతం కాంగ్రెస్ విధానాలను ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్‌తో కుమ్మక్కు అయినందున ఆయనపై చర్యలు తీసుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనకాడుతున్నదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరం అక్రమాల్లో కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని, అందుకే దర్యాప్తును కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకే పరిమితం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని, అందుకే ఇప్పటివరకు ఒక్కరిపై కేసీఆర్, హరీశ్‌రావు సహా అధికారులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని బండి సంజయ్ విమర్శించారు.
కేసును నీరుగార్చేందుకే సీబీఐ దర్యాప్తు డ్రామా :
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం కాంగ్రెస్ తీరునే తప్పుపడుతున్నారు. కోర్టులో సరైన ఆధారాలు సమర్పించకపోవడం, సమర్ధవంతంగా వాదనలను వినిపించని కారణంగానే కేసు వీగిపోయిందని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తును కోరడం కేవలం మొక్కుబడి చర్యేనని, అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లయినా ఒక్కరిని కూడా జైలుకు పంపకపోవడం వెనక ఆ రెండు పార్టీల మధ్య ఉన్న రహస్య ఒప్పందమేనని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా కేసును నీరుగార్చే ఉద్దేశంతోనే సీబీఐ దర్యాప్తు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి పొలిటికల్ డ్రామా ఆడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులను కాపాడడం ద్వారా కాంగ్రెస్ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కల్వకుంట్ల ఫ్యామిలీ ఏటీఎం లాగా వాడుకున్నదని విమర్శించిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తరహా యాక్షన్ ఎందుకు లేదని ప్రశ్నించారు.
ఇకపై సీరియస్ పొలిటికల్ డిబేట్‌గా సీబీఐ దర్యాప్తు :
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పదేపదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు సహా చత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిని కూడా వెలికితీయాలనుకుంటున్నది. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలోని అవకతకవలను కూడా బహిర్గతం చేయాలనుకుంటున్నది. విద్యుత్ రంగానికి సంబంధించి కూడా జస్టిస్ మదన్ బీ లోకూర్ సమర్పించిన నివేదికను సీబీఐ డైరెక్టర్‌కు అందజేసి సమగ్ర దర్యప్తు జరిపి చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. ఢిల్లీ పర్యటన సందర్భంగా కాళేశ్వరంతో పాటు విద్యుత్ అవినీతిపైనా సీబీఐ డైరెక్టర్‌కను కలిసి సీఎం, మంత్రులు చర్చించనున్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లను పొలిటికల్‌గా కార్నర్ చేయడానికి సీబీఐ దర్యాప్తు అంశం సాట్ టాపిక్‌గా మారింది.
ప్రాణహితపై మహారాష్ట్ర సీఎంకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ :
ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ విషయమై మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. బ్యారేజీ ఎత్తును గతంలో 152 మీటర్లకు ప్రతిపాదన చేయగా మహారాష్ట్రలో ముంపు సమస్య తలెత్తుతుందనే కారణంగా 148 మీటర్లకే పరిమితం చేయాలని అప్పటి సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్ సూచించారు. ఇప్పుడు కూడా ఆయనే సీఎంగా ఉండడంతో మధ్యేమార్గంగా 150 మీటర్లతో బ్యారేజీ నిర్మాణంపై చర్చించి కొలిక్కి తేవాలని రాష్ట్ర క్యాబినెట్ ఇటీవల నిర్ణయించింది. అందులో భాగంగా త్వరలో ఆయనను కలిసి చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవలే లేఖ రాసినట్లు ఇరిగేషన్ వర్గాల ద్వారా తెలిసింది. అపాయింట్‌మెంట్ దొరకగానే మహారాష్ట్రకు వెళ్ళి చర్చలు జరిపే అవకాశమున్నది.

