కలం, నల్లగొండ బ్యూరో : నగల కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం నల్లగొండ (Nalgonda) జిల్లా హాలియాలో (Haliya) వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హాలియా పట్టణంలోని రెడ్డి కాలనీకి చెందిన సుంకిరెడ్డి అనసూయమ్మ (65) వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఒంటరి మహిళగా ఉన్న అనసూయమ్మ బంగారు ఆభరణాలపై కొందరు కన్నేశారు. అయితే రేషన్ బియ్యానికి సంబంధించి అనసూయమ్మకు గతంలో 2000 రూపాయలు ఇచ్చారు.. పథకం ప్రకారం రేషన్ బియ్యానికి సంబంధించి మిగిలిన 300 రూపాయలను ఇస్తామంటూ రాములు అనసూయమ్మకు ఫోన్ చేశాడు. దీంతో అనసూయమ్మ డబ్బుల కోసం రాములు ఇంటికి వెళ్ళింది.
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోకి అనసూయమ్మ రాగానే వెనకనుంచి తలపై బలంగా కొట్టారు. దీంతో స్పృహ కోల్పోయిన అనసూయమ్మ గొంతు కోశారు. ఆమె ఒంటిపై ఉన్న నాలుగు తులాల, గొలుసు, చెవి దిద్దులను తీసుకున్నారు. ఆ తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోనే గోతి తీసి వృద్ధురాలి మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. ఆ గుంతను గుర్తుపట్టకుండా ఉండేందుకు ఖాళీ బీరు, వాటర్ బాటిల్స్ ను వేసి ఉంచారు. అనసూయమ్మ ఒంటిపై నుండి తీసుకున్న బంగారు ఆభరణాలను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఫైనాన్స్ లో తాకట్టు పెట్టారు. వచ్చిన డబ్బులతో కొన్ని అప్పులను కూడా తీర్చేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం కూలి పనుల కోసం వెళ్లిన అనసూయమ్మ ఇంటికి రాకపోవడంతో ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారణలో అనసూయమ్మ ఓ దుకాణంలోకి వెళ్లినట్టు సీసీ టీవీ పుటేజీల ఆధారంగా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల తర్వాత అదే దుకాణంలో పూడ్చిపెట్టిన అనసూయమ్మ మృతదేహాన్ని పోలీసులు కనిపెట్టారు. అయితే అనసూయమ్మను ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారం కోసం హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read Also: ఢిల్లీ పెద్దలతో టీపీసీసీ చీఫ్ భేటీ.. కీలక వ్యాఖ్యలు!
Follow Us On: Pinterest


