కలం, ఖమ్మం బ్యూరో : స్వయం సహాయక సంఘాల మహిళకే కాకుండా అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. మంగళవారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడు డివిజన్లో డిప్యూటీ సీఎం చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఒక్కరోజే మధిర మున్సిపాలిటీ పరిధిలో 10,272 చీరల పంపిణీ చేస్తామన్నారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరితే వడ్డీ లేని రుణాలతో పాటు అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయన్నారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఏడాది కాలంలో పూర్తి అవుతాయని, సుచి శుభ్రత తో కూడిన నగరంగా మధిరను మార్చడమే తన లక్ష్యమని డిప్యూటీ సీఎం తెలిపారు. కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు ఇసుక, కంకర, సిమెంటు వస్తువులు, పనులతో వాతావరణం గందరగోళంగా ఉంటుందని, ఇల్లు పూర్తయిన తర్వాత హాయిగా అనిపిస్తుందన్నారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల క్రమంలో కొంత ఇబ్బంది కలుగుతుందని.. అందరూ గుర్తించి, సహకరించాలని ఆయన కోరారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయిన తర్వాత మధిర పట్టణం మొత్తం కొత్త సీసీ రోడ్లను నిర్మిస్తామని Bhatti Vikramarka తెలిపారు.


