epaper
Tuesday, January 20, 2026
spot_img
epaper

రాజకీయ వేధింపులే కాంగ్రెస్ ఏకైక అజెండా : ఎర్రబెల్లి దయాకర్ రావు

కలం, వరంగల్ బ్యూరో : రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాగా మారిపోయిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడమే కాకుండా కేసును కూడా కొట్టేసిందన్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతోనే ఈ డ్రామా ముగిసిపోయినా, మళ్లీ హరీశ్​ రావుకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత దిగజారిందో అర్థమవుతోందని విమర్శించారు.

ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి కాదన్నారు. హరీశ్​ రావు (Harish Rao) అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడటంలో కానీ ఆయన చూపిస్తున్న చొరవను చూసి రేవంత్ రెడ్డికి వణుకు పుడుతోందని.. అందుకే రాజకీయంగా ఆయనను ఎదుర్కోలేక, ఇలాంటి తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. గత 24 నెలలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ దారుణమైన పాలనను నిలదీస్తున్నందుకే హరీశ్​ రావును టార్గెట్ చేస్తూ ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.

తమకు చట్టం పైన, న్యాయస్థానాల పైన పూర్తి గౌరవం ఉందని.. ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ‘విచారణల పేరుతో, నోటీసులతో ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తే అది మీ భ్రమ మాత్రమే. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులకు గురిచేసినా ప్రజల పక్షాన మిమ్మల్ని వేటాడడం ఆపేది లేదు. మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం, మిమ్మల్ని అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి లో ఉండి పార్టీ జెండా గద్దెలు కూలగొట్టాలనడం సిగ్గుచేటు చర్య’ అని ఎర్రబెల్లి (Errabelli) వెల్లడించారు.

Read Also: ట్రాఫిక్ చలాన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>