ఏఐ ఎఫెక్ట్.. ఆ దేశంలో లేదు.. ఉద్యోగులకు నో టెన్షన్

కలం, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో ఏఐ భయం పట్టుకున్నది. తమ కొలువు ఏ క్షణమైనా పోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. అందుకు అనుగుణంగానే ప్రముఖ కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. భారీగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. అయితే యూరప్‌లోని చిన్న దేశమైన డెన్మార్క్‌ ఉద్యోగుల్లో మాత్రం ఆ భయం లేదట. అందుకు కారణం ఆ దేశం అమలు చేస్తున్న విధానాలే.. డెన్మార్క్ 1990లో ‘ఫ్లెక్సిక్యూరిటీ’ (Flexicurity) మోడల్‌ ప్రవేశపెట్టింది. ఈ విధానంతో ఉద్యోగులు నిశ్చింతగా ఉన్నారు.

ఏమిటీ ఫ్లెక్సిక్యూరిటీ

ఫ్లెక్సిక్యూరిటీ అంటే ‘ఫ్లెక్సిబిలిటీ’ (సౌలభ్యం), ‘సెక్యూరిటీ’ (భద్రత) కలయిక. ఈ విధానంలో కంపెనీలకు ఉద్యోగులను సులభంగా నియమించుకునే, అవసరమైతే తొలగించే స్వేచ్ఛ ఇస్తారు. ఉద్యోగులకు కూడా అదే స్థాయిలో ప్రభుత్వం భరోసా ఇస్తుంది. AI వంటి కొత్త టెక్నాలజీలను పరీక్షించేందుకు సంస్థలకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. అదే సమయంలో ఉద్యోగం కోల్పోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక భరోసా, నిరుద్యోగ భృతి, కొత్త నైపుణ్యాల శిక్షణ అందిస్తుంది.

ఉద్యోగం కోల్పోతే భారీగా పరిహారం

డెన్మార్క్‌లో ఒక వేళ ఏదైనా కంపెనీ ఒక ఉద్యోగిని తొలగిస్తే సదరు ఉద్యోగికి గత జీతంలో 90 శాతం వరకు నిరుద్యోగ భృతి లభిస్తుంది. ఇది గరిష్ఠంగా రెండు సంవత్సరాల వరకు కొనసాగుతుంది. అయితే దీనికి ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి ఉంటుంది. ప్రస్తుతం గరిష్ఠంగా నెలకు 22,041 డానిష్ క్రోనర్‌లు (సుమారు రూ.3.3 లక్షలు) వరకు చెల్లిస్తున్నారు.

డెన్మార్క్ ఉద్యోగులకు నో టెన్షన్

నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త పీటర్ హోవిట్ మాట్లాడుతూ.. “డెన్మార్క్ ఉద్యోగులు కొత్త టెక్నాలజీ ప్రభావం గురించి ఇతర దేశాల కార్మికుల కంటే తక్కువగా భయపడుతున్నారని పలు అధ్యయనాలు చూపించాయి. ఇది ప్రతి దేశం అనుసరించాల్సిన గొప్ప మోడల్” అని అన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) కూడా AI ప్రభావంపై చర్చిస్తూ డెన్మార్క్ విధానాన్ని “గోల్డెన్ ట్రైయాంగిల్”గా అభివర్ణించింది. కంపెనీలకు స్వేచ్ఛ, ఉద్యోగులకు ఆర్థిక భద్రత, కొత్త ఉద్యోగాలకు శిక్షణ.. ఈ మూడు అంశాల మధ్య సమతుల్యతను ఈ మోడల్‌ సాధించడానికి ప్రయత్నిస్తోందని తెలిపింది.

AIతో భారీ మార్పులు తప్పవు

“ప్రస్తుతం ప్రపంచం ప్రతి రంగాన్ని ప్రభావితం చేసే కొత్త టెక్నాలజీ విప్లవాన్ని చూస్తోంది” అని హోవిట్ పేర్కొన్నారు. “ఈ టెక్నాలజీలు కొత్త ఉద్యోగాలు సృష్టించే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ.. ప్రారంభంలో అవి పాత ఉద్యోగాలను తొలగిస్తున్నాయనే విషయం మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది” అన్నారు. AI రావడంతో ప్రస్తుతం ఉన్న అనేక నైపుణ్యాలు పనికిరాకపోవచ్చని హెచ్చరించారు. అయితే అదే సమయంలో కొత్త అవకాశాలు కూడా పుడతాయని చెప్పారు. “కొత్త టెక్నాలజీలు ఎన్నో అవకాశాల ద్వారాలు తెరుస్తాయి. కానీ అవి మొదట వచ్చినప్పుడు ఆ అవకాశాలు ఎక్కడ ఉన్నాయో స్పష్టంగా కనిపించదు” అని వివరించారు.

భారత్‌లో సాధ్యమేనా?

ఈ నేపథ్యంలో భారత్‌లో కూడా డెన్మార్క్ తరహా వ్యవస్థ అమలు సాధ్యమా అనే చర్చ మొదలైంది. ఆర్థికవేత్త అభిరూప్ సర్కార్ అభిప్రాయం ప్రకారం.. భారత్‌లో ‘ఫ్లెక్సిబిలిటీ’ ఇప్పటికే ఉన్నా, ‘సెక్యూరిటీ’ మాత్రం  లేదన్నారు. “ఉద్యోగులను తీసేయడం, నియమించడం ఇక్కడ సులభమే. కానీ ఉద్యోగ భద్రత లేదు. భారత కార్మికుల్లో మెజారిటీ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. అక్కడ అసలు ఉద్యోగ భద్రతే ఉండదు” అని ఆయన తెలిపారు. కార్పొరేట్ రంగంలో కూడా శాశ్వత ఉద్యోగాల కంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెరుగుతున్నాయని చెప్పారు. “ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ విధానం పెరుగుతోంది” అని వ్యాఖ్యానించారు.

భారత్‌కు భారీ ఆర్థిక భారం

డెన్మార్క్ మాదిరి సంక్షేమ వ్యవస్థను భారత్‌లో అమలు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అభిరూప్ సర్కార్ అభిప్రాయపడ్డారు. “డెన్మార్క్ చిన్న దేశం. అక్కడ పన్నుల వసూళ్లు అధికంగా ఉంటాయి. కానీ భారత్‌కు మౌలిక సదుపాయాలు, సబ్సిడీలు, వ్యవసాయ మద్దతు, ఆహార భద్రత వంటి అనేక భారీ బాధ్యతలు ఉన్నాయి” అన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిక మార్కెట్లలో ఒకటైన భారత్‌లో స్కాండినేవియన్ తరహా భద్రతా వ్యవస్థను నిర్మించడం చాలా క్లిష్టమని పేర్కొన్నారు. AI వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం కొత్త విషయం కాదని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. పారిశ్రామిక విప్లవం సమయంలో యంత్రాలు రావడంతో కూడా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతామనే భయంతో ఆందోళన చెందారు. అప్పట్లో కార్మికులు యంత్రాలను ధ్వంసం చేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. “ఇంగ్లాండ్‌లో యాంత్రీకరణ వచ్చినప్పుడు భారీగా ఉద్యోగ నష్టాలు జరిగాయి. దాదాపు 100 నుంచి 150 సంవత్సరాల వరకు ఉద్యోగ మార్కెట్‌ కష్టకాలాన్ని ఎదుర్కొంది” అని సర్కార్ చెప్పారు. కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఇదే తరహా భయాలు వ్యక్తమయ్యాయని, కానీ తర్వాత ఊహించని కొత్త అవకాశాలు పుట్టుకొచ్చాయని గుర్తుచేశారు.

తాత్కాలిక కష్టాలు తప్పవా?

ఏఐ ప్రభావం తాత్కాలికంగా అనేక మందికి ఇబ్బందులు కలిగించవచ్చని నిపుణులు అంగీకరిస్తున్నారు. అయితే టెక్నాలజీ అభివృద్ధిని అడ్డుకునే దేశాలు దీర్ఘకాలంలో వెనుకబడిపోతాయని హోవిట్ హెచ్చరించారు. “AI వల్ల సమాజానికి దీర్ఘకాలంలో మంచి జరుగుతుంది. కానీ స్వల్పకాలంలో కొందరికి ఇబ్బంది తప్పదు‘ అని సర్కార్ అన్నారు.

AI వల్ల కంపెనీలు లాభదాయకంగా మారితే ఆ డబ్బు తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి వస్తుందని, తద్వారా కొత్త అవకాశాలు సృష్టించబడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. AI ఉద్యోగ మార్కెట్‌ను మార్చడం ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిగా కనిపిస్తోందని, అసలు ప్రశ్న మాత్రం ఆ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేంత ఆర్థిక భద్రతా వ్యవస్థను దేశాలు ముందుగానే నిర్మించగలవా? అన్నదేనని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ విషయంలో డెన్మార్క్ ప్రపంచానికి ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>