మిచెల్ మార్ష్ ‘మెరుపు’ దాడి.. చెన్నైపై లక్నో ఘనవిజయం!

కలం, వెబ్ డెస్క్:  చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లపై లక్నో సూపర్ జయంట్స్ ఓపెనర్ మిఛెల్ మార్ష్ వీరుచుకుపడ్డాడు. బౌండ్రీల మోతమోగించాడు. 38 బంతుల్లో 90 పరుగులు చేసి చెన్నై బౌలర్లకు సింహస్వప్నంలా మారాడు. మరో ఓపెనర్ జోష్ ఇంగ్లీస్ కూడా మార్ష్ మంచి తోడుగా నిలుస్తూ పరుగుల వరద పారించాడు. వీరిద్దరి అందించిన అంద్భుత ఆరంభంతో చెన్నై‌పై లక్నో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్‌ను ఊచకోత కోశారు. లక్నో ఇచ్చిన 188 పరుగుల లక్ష్యాన్ని లక్నో 17 ఓవర్లలో ఛేదించేసింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఓపెనర్లు సంజూ శాంసన్ (20), రుతురాజ్ గైక్వాడ్ (13) ఆకాశ్ ధాటికి స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. ఊర్విల్ పటేల్ (6) కూడా నిరాశపరచడంతో 52 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో పడింది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును కార్తీక్ శర్మ తన అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. లక్నో బౌలర్లను ఉతికేస్తూ కేవలం 42 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 71 పరుగులు పిండుకున్నాడు. అతడికి డెవాల్డ్ బ్రెవిస్ (25) కాసేపు సహకరించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే ఈ జోడీని విడదీయడంలో షాబాజ్ అహ్మద్, మహమ్మద్ షమీ సఫలమైనా.. అప్పటికే చెన్నై గౌరవప్రదమైన స్థితికి చేరుకుంది. ఇన్నింగ్స్ చివరలో శివమ్ దూబే తన పవర్ హిట్టింగ్‌తో స్టేడియంను హోరెత్తించాడు. కేవలం 16 బంతులు ఎదుర్కొన్న దూబే 200 స్ట్రైక్ రేట్‌తో 32 పరుగులు జోడించి నాటౌట్‌గా నిలిచాడు. ప్రశాంత్ వీర్ (13*) అతడికి అండగా నిలవడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్ తన కోటా 4 ఓవర్లలో కేవలం 26 పరుగులే ఇచ్చి 3 ప్రధాన వికెట్లు పడగొట్టి చెన్నై వెన్ను విరిచాడు. మరోవైపు సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ 41 పరుగులు సమర్పించుకోగా, ప్రిన్స్ యాదవ్ 49 పరుగులు ఇచ్చి అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు. మయాంక్ యాదవ్ పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్లు తీయలేకపోయాడు.

188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఓపెనర్లు కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. మిచెల్ మార్ష్ చెన్నై బౌలర్లను ఉతికేస్తూ కేవలం 38 బంతుల్లోనే 90 పరుగులు పిండుకున్నాడు. ఇందులో 9 ఫోర్లు, 7 సిక్సర్లు ఉండటం విశేషం. అతడికి తోడుగా జోష్ ఇంగ్లిస్ (36) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 135 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు. ఆఖర్లో నికోలస్ పూరన్ (17 బంతుల్లో 32 నాటౌట్) వరుస సిక్సర్లతో విరుచుకుపడి లక్నోకు విజయాన్ని అందించాడు.

చెన్నై బౌలర్లలో ఎవరూ లక్నో జోరును అడ్డుకోలేకపోయారు. ముఖ్యంగా అన్షుల్ కాంబోజ్ వేసిన 2.4 ఓవర్లలోనే ఏకంగా 63 పరుగులు సమర్పించుకున్నాడు. ముకేశ్ చౌదరి, స్పెన్సర్ జాన్సన్ తలో వికెట్ తీసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కేవలం 16.4 ఓవర్లలోనే లక్నో 188 పరుగులు చేసి మ్యాచ్ ముగించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>