కలం, ఖమ్మం బ్యూరో: రామ రాజ్యం విరాజిల్లాల్సిన భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో ఇప్పుడు ‘మద్యం’ రాజ్యం నడుస్తోంది. పవిత్ర గోదావరి తీరంలో మద్యం మాఫియా బీభత్సం సృష్టిస్తోంది. జిల్లాలో మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుండగా, సామాన్య కూలీలు మాత్రం ఆ మత్తులో చిక్కుకుని తమ సంపాదనను మాఫియాకు ధారపోస్తున్నారు. జిల్లాలో అధికారికంగా ఉన్న 88 వైన్ షాపులకు తోడు, సుమారు 200కు పైగా అనధికారిక బెల్ట్ షాపులు (Belt Shops) పుట్టగొడుగుల్లా వెలిశాయి. కిరాణా కొట్టు నుంచి టీ స్టాల్ వరకు ఎక్కడ చూసినా మద్యం బాటిళ్లే దర్శనమిస్తున్నాయి. “ప్రజల వద్దకే పాలన” అన్న నినాదాన్ని మాఫియా వెక్కిరిస్తూ, “ఇంటింటికీ మద్యం” సరఫరా చేస్తోంది. ఉదయం సూర్యుడు ఉదయించకముందే బెల్ట్ షాపుల తలుపులు తెరుచుకుంటున్నాయి.. అర్ధరాత్రి దాటినా విక్రయాలు ఆగకపోవడం గమనార్హం.
వైన్ షాపుల నిర్వాహకులు అంతా ఒకే తాటిపైకి వచ్చి ‘సిండికేట్’గా ఏర్పడి విచ్చలవిడి దోపిడీకి తెరలేపారనేది బహిరంగ రహస్యమే. ప్రముఖ బ్రాండ్లను వైన్ షాపుల్లో అందుబాటులో ఉంచకుండా, వాటిని నేరుగా బెల్ట్ షాపులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వైన్ షాపు నుంచి బెల్ట్ షాపుకు వెళ్లేసరికి బాటిల్ ధర అమాంతం పెరిగిపోతోంది. ఎమ్మార్పీ ధరలను గాలికొదిలేసి, క్వార్టర్ బాటిల్‌పై రూ. 50 నుంచి రూ. 80 వరకు అదనంగా వసూలు చేస్తూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. ఎవరైనా ఎమ్మార్పీ ధర గురించి నిలదీస్తే, షాపుల వద్ద ఉన్న సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తూ భౌతిక దాడులకు సైతం వెనకాడటం లేదని బాధితులు వాపోతున్నారు. జిల్లాలో మద్యం వ్యాపారం అక్షరాలా కోట్లలో సాగుతోంది.సాధారణ రోజుల్లోనే రోజుకు రూ. 4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వ్యాపారం జరుగుతుండగా, పండగ సమయాల్లో అది రూ. 10 కోట్లు దాటుతోందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఏడాదికి సగటున రూ. 1,600 కోట్ల నుండి రూ.1,800 కోట్ల టర్నోవర్ జరుగుతుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
జిల్లాలో 6 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నప్పటికీ, అక్రమ విక్రయాలు బహిరంగంగానే సాగుతున్నాయి. అధికారుల కళ్లముందే బెల్ట్ షాపులకు వాహనాల్లో మద్యం సరఫరా అవుతున్నా, వారు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక భారీ స్థాయిలో ‘మామూళ్ల’ పర్వం నడుస్తోందని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. “కూలీ పనికి వెళ్తే వచ్చే 6వందల్లో 4 వందలు ఈ బెల్ట్ షాపులకే పోతున్నాయి. ఊరూరా మద్యం షాపులు పెట్టి మా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?” అని పాల్వంచ పట్టణానికి చెందిన మహిళ, దుర్గ నిలదీస్తున్నారు. మద్యం మత్తులో యువత తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. నేరాలు పెరగడానికి కూడా ఈ అక్రమ విక్రయాలే ప్రధాన కారణమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి, బెల్ట్ షాపులను రద్దు చేయడమే కాకుండా, ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేసే వైన్ షాపుల లైసెన్స్‌లను రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
భద్రాద్రిలో గల్లీ గల్లీలో బెల్ట్ షాపులు.. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

